ఫీజుల ఖరారు.. అందరి మేలు కోసమే

27 Aug, 2021 02:08 IST|Sakshi
విజయవాడ ఆర్‌ అండ్‌ బీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న జస్టిస్‌ కాంతారావు

తల్లిదండ్రులు సహా 90 శాతం స్కూళ్ల యాజమాన్యాల్లో ఆనందం

కమిషన్‌ నిర్ణయించిన ఫీజులే కడతామని తల్లిదండ్రులు చెప్పాలి

ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే 9150381111కు ఫిర్యాదు చేయాలి

ఫీజు చాలదనుకునే యాజమాన్యాలు కమిషన్‌ను సంప్రదించొచ్చు

ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో సర్వీస్‌ నిబంధనలు

స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు ర్యాంకింగులతో పాటు అక్రేడిటేషన్‌

పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కాంతారావు

సాక్షి, అమరావతి: తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలందరి మేలును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో తొలిసారిగా ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు ఫీజులు ఖరారుచేశామని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌.కాంతారావు తెలిపారు. తల్లిదండ్రులు, 90 శాతానికి పైగా ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు సంతృప్తిని వ్యక్తంచేస్తున్నారన్నారు. కమిషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఎ. విజయశారదారెడ్డి, సభ్యుడు అజయ్‌కుమార్, కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డితో కలిసి గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

‘రాష్ట్రంలో దశాబ్దాల నుంచి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. గత ఏడాదిలోనే ఫీజులను నిర్ణయించాలనుకున్నాం. కానీ, జీఓ–57 విడుదలైనా న్యాయవివాదంతో సస్పెండ్‌ కావడం, కరోనా పరిస్థితులవల్ల ముందుకెళ్లలేకపోయాం. ఇప్పుడు వివిధ వర్గాల వారందరితో చర్చించి ప్రాంతాల వారీగా ఆయా విద్యాసంస్థల నిర్వహణకయ్యే వాస్తవిక వ్యయాలను పరిగణనలోకి తీసుకుని పంచాయతీ, పట్టణ, నగర ప్రాంతాల వారీగా కొన్ని ప్రమాణాలను అనుసరించి ఫీజులు నిర్ణయించాం. రాష్ట్రవ్యాప్తంగా 15వేలకు పైగా స్కూళ్లు, 2,500కు పైగా కాలేజీలున్నాయి. సంస్థల వారీగా ఫీజులు నిర్ణయించడం సాధ్యంకాదు కనుక ఏ విద్యా సంస్థకైనా తమకు ఆ ఫీజు చాలదని భావిస్తే 15 రోజుల్లో జమా ఖర్చులకు సంబంధించిన అన్ని రికార్డులతో కమిషన్‌కు దరఖాస్తు చేయవచ్చు. దాన్ని పరిశీలించి కమిషన్‌ సానుకూల పరిష్కారం చూపిస్తుంది.  చదవండి: డ్రోన్ల ఆపరేషన్‌ సులభతరం

అధిక ఫీజులు వసూలుచేస్తే చర్యలు
కనీస సదుపాయాల్లేకుండా అధిక ఫీజులు వసూలుచేసే సంస్థలపై చర్యలు తప్పవు. మూడేళ్ల వరకు ఈ ఫీజులు అమల్లో ఉంటాయి. ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు కమిషన్‌ నిర్ణయించిన ఫీజులు మాత్రమే చెల్లించాలి. ఎవరైనా ఒత్తిడి చేస్తే కమిషన్‌కు సంబంధించిన 9150381111 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలి. గత ఏడాదిలో నిబంధనలు పాటించని 120 విద్యాసంస్థలపై చర్యలు తీసుకున్నాం’.. అని జస్టిస్‌ కాంతారావు వివరించారు. 

విద్యారంగంలో మార్పు తెచ్చేందుకే..
వైస్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఎ. విజయశారదారెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రలో విద్యారంగ పరిస్థితిని గమనించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాటిలో మార్పు తెచ్చేందుకు కమిషన్‌ను ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లకు ప్రాంతాల వారీగా నిర్ణయించిన ఫీజులను వివరించారు. ప్రైవేటు విద్యాసంస్థలను నియంత్రించడమే కాకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని ముఖ్యమంత్రి ఎంతో అభివృద్ధి చేస్తున్నారని.. నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, విద్యకానుక తదితర కార్యక్రమాల గురించి చెప్పారు.  చదవండి: సాగు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమం !

ప్రైవేట్‌ సంస్థలు జీతాలివ్వడంలేదు
కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా కార్పొరేట్‌ కాలేజీలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలుచేస్తున్నా ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు సీఎం దీనిపై దృష్టిపెట్టి ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తూనే ప్రైవేటు సంస్థలపైనా నియంత్రణను పెట్టారని తెలిపారు. విద్యార్థిపై వెచ్చించే మొత్తం ఆధారంగా మాత్రమే ఫీజులు వసూలు చేయాలి కానీ అలా జరగడంలేదని.. దీనినే  కమిషన్‌ అమలుచేస్తుందని చెప్పారు. చాలా ప్రైవేటు సంస్థలు సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వడంలేదని.. కనీసం అపాయింట్‌మెంటు ఆర్డర్‌ కూడ ఇవ్వడంలేదని ఆయన చెప్పారు. సర్వీసు రూల్సు అసలు లేవని.. వారికి ఇకపై సర్వీసు రూల్సు పెట్టనున్నట్లు సాంబశివారెడ్డి వెల్లడించారు. అలాగే,  రానున్న కాలంలో ఆయా సంస్థల ప్రమాణాలను అనుసరించి ర్యాంకులు, అక్రిడిటేషన్‌ను అమలుచేస్తామని అని తెలిపారు.  

మరిన్ని వార్తలు