మరో టీడీపీ నేతకు జస్టిస్‌ లలిత బెయిల్‌

26 Oct, 2021 04:43 IST|Sakshi

మొన్న పట్టాభి.. నేడు బ్రహ్మంచౌదరికి..

20 వేలతో రెండు పూచీకత్తుల సమర్పణకు ఆదేశం

మూడు వారాల పాటు మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలోకి రావొద్దని ఆదేశం

అడ్వాన్స్‌ ఆర్డర్‌ రూపంలో ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: టీడీపీకి చెందిన మరో నాయకుడికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లలిత బెయిల్‌ మంజూరు చేశారు. ఇప్పటికే టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్‌ మంజూరు చేసిన జస్టిస్‌ లలిత.. తాజాగా ఆ పార్టీ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంచౌదరికి బెయిల్‌ ఇచ్చారు. రూ.20 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని బ్రహ్మంచౌదరిని ఆదేశించారు. మూడు వారాల పాటు బ్రహ్మంచౌదరి మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలోకి ప్రవేశించరాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె అడ్వాన్స్‌ ఆర్డర్‌ జారీ చేశారు.

పట్టాభి బెయిల్‌ సందర్భంగా కూడా ఆమె అడ్వాన్స్‌ ఆర్డర్‌ రూపంలో ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యాలయంలో జరిగిన గొడవ సందర్భంగా అక్కడకు వెళ్లిన తనను పలువురు టీడీపీ నేతలు కులం పేరుతో దూషించి, హత్యాయత్నం చేశారంటూ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ సక్రూనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో అరెస్ట్‌ అయిన బ్రహ్మంచౌదరి బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ లలిత సోమవారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. బ్రహ్మంచౌదరిని అరెస్ట్‌ చేసిన పోలీసులు అతన్ని కొట్టారని శ్రీనివాస్‌ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన సంబంధిత కోర్టు మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారని, అయితే మేజిస్ట్రేట్‌ మాత్రం ఎలాంటి వైద్య పరీక్షలకు ఆదేశించలేదన్నారు. అంతేకాక మంగళగిరి పోలీసులు బ్రహ్మంచౌదరిని అరెస్ట్‌ చేసి మేడికొండూరు పోలీసులకు అప్పగించారని, భౌతిక హాని తలపెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని ఆయన వివరించారు. 

విధుల్లో ఉన్న పోలీసును కులం పేరుతో దూషించారు.. 
పోలీసుల తరఫున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎస్‌.దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. విధుల్లో ఉన్న పోలీసు అధికారిని పిటిషనర్, ఇతర టీడీపీ నేతలు కులం పేరుతో దూషించారని తెలిపారు. విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని చెప్పారు. ఈ కేసులోనే కాక మరో మూడు కేసుల్లో కూడా బ్రహ్మంచౌదరి నిందితుడుగా ఉన్నారని వివరించారు. పోలీసుల చిత్తశుద్ధిని పరిగణనలోకి తీసుకోవాలని, మొదట హత్యాయత్నం కేసు నమోదు చేయగా, తర్వాత దానిని తొలగించారని దుష్యంత్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయమూర్తి జస్టిస్‌ లలిత స్పందిస్తూ.. పోలీసులు కొట్టారంటూ బ్రహ్మంచౌదరి గాయాలు చూపినప్పుడు మేజిస్ట్రేట్‌ ఎందుకు వైద్య పరీక్షలకు ఆదేశించలేదని ప్రశ్నించారు. అలా చేయకుండా కేవలం కొట్టారన్న విషయాన్ని రికార్డ్‌ చేసి ఊరుకోవడం ఎంత మాత్రం సబబని ప్రశ్నించారు.

మేజిస్ట్రేట్‌ చట్ట ప్రకారమే వ్యవహరించారు...
దీనికి దుష్యంత్‌ స్పందిస్తూ.. కొట్టారని పిటిషనర్‌ చెప్పగానే, దానిపై మేజిస్ట్రేట్‌ పోలీసుల వివరణ కోరాని, రేపు పోలీసులిచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకుంటే, షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో పాటు విచారణకు సైతం మేజిస్ట్రేట్‌ ఆదేశించవచ్చని తెలిపారు. చట్టం నిర్దేశించిన విధి విధానాల ప్రకారమే మేజిస్ట్రేట్‌ వ్యవహరించారని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ లలిత..  పిటిషనర్‌పై పోలీసులు నమోదు చేసిన కేసులో ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసులన్నారు. అందువల్ల అతనికి బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టు చెప్పారు.

ఆ సమయంలో దుష్యంత్‌ జోక్యం చేసుకుంటూ.. రెండు మూడు వారాల పాటు మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో ప్రవేశించకుండా బ్ర హ్మంచౌదరిని నియంత్రిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరగా.. అందుకు న్యాయమూర్తి సానుకూలం గా స్పందించారు.  పిటిషనర్‌ గాయాలను చూపినప్పుడు వైద్య పరీక్షలకు ఎందుకు ఆదేశించలేదో ఓ నివేదికను తమ ముందుం చాలని న్యాయమూర్తి ఆదేశించారు.  

మరిన్ని వార్తలు