హెచ్చార్సీ చైర్మన్‌గా జస్టిస్‌ సీతారామమూర్తి

18 Mar, 2021 03:30 IST|Sakshi
జస్టిస్‌ సీతారామమూర్తి, దండే సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు

సభ్యులుగా మాజీ జడ్జి దండే సుబ్రహ్మణ్యం, న్యాయవాది జి.శ్రీనివాసరావు 

సీఎం జగన్‌ అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఆమోదం 

సాక్షి, అమరావతి: రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ) చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామమూర్తిని ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిషన్‌ సభ్యులుగా రిటైర్డ్‌ జిల్లా జడ్జి దండే సుబ్రహ్మణ్యం (జ్యుడిషియల్‌), న్యాయవాది డాక్టర్‌ గోచిపాత శ్రీనివాసరావు (నాన్‌ జ్యుడిషియల్‌)ను ఎంపిక చేశారు. బుధవారం సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన శాసనమండలి చైర్మన్‌ షరీఫ్, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, హోం మంత్రి మేకతోటి సుచరిత సభ్యులుగా ఉన్న కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. గత నెల 4న స్క్రీనింగ్‌ కమిటీ ఎంపిక చేసిన పేర్లను తొలుత హోం మంత్రి సుచరిత ప్రతిపాదించగా కమిటీ ఆమోదించింది. ఎంపిక చేసిన వారి పేర్లను తదుపరి ఆమోదం కోసం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ప్రభుత్వం పంపించనుంది. 
 
హెచ్చార్సీ చైర్మన్, సభ్యుల వివరాలివే.. 

జస్టిస్‌ మంథాట సీతారామమూర్తి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1958, జనవరి 16న న్యాయవాదుల కుటుంబంలో జని్మంచారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. లా ఆఫ్‌ టార్ట్స్‌లో బంగారు పతకం సాధించారు. 1996లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యేంతవరకు న్యాయవాదిగా 12 ఏళ్ల పాటు ప్రాక్టీస్‌ చేశారు. 1996–97లో బెస్ట్‌ ట్రైనీ జిల్లా జడ్జిగా బంగారు పతకం పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ స్పెషల్‌ జడ్జి, విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి, విజయనగరం ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి, రంగారెడ్డి ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. హైకోర్టు రిజి్రస్టార్‌ జనరల్‌గానూ వ్యవహరించారు. 2013, అక్టోబర్‌ 23న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 2016, మార్చి 2న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. గతేడాది జనవరి 15న హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. 
 
డాక్టర్‌ గోచిపాత శ్రీనివాసరావు: గుంటూరు జిల్లా నంబూరు స్వస్థలం. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అంతకుముందు గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. మానవ హక్కులకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. మానవ హక్కులపై ఆయన రాసిన పలు ఆరి్టకల్స్‌ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. న్యాయశాస్త్రంలో డాక్టరేట్‌ పొందారు. 
 
దండి సుబ్రహ్మణ్యం: కర్నూలు స్వస్థలం. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. 1955, ఆగస్టు 8న జన్మించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1982లో న్యాయవాదిగా నమోదై 1987 వరకు ప్రాక్టీస్‌ చేశారు. తర్వాత జిల్లా మున్సిఫ్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2005లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. తర్వాత హైకోర్టు లీగల్‌ సరీ్వసెస్‌ కమిటీ కార్యదర్శిగా, అప్పటి ప్రధాన న్యాయమూర్తి ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, టీటీడీ లీగల్‌ ఆఫీసర్‌గా, ఏపీ మానవహక్కుల కమిషన్‌ కార్యదర్శిగా, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు.    

మరిన్ని వార్తలు