చంద్రబాబుపై కేఏ పాల్‌ ఫిర్యాదు.. దాడికి ప్రయత్నించిన టీడీపీ యువకులు

30 Dec, 2022 08:41 IST|Sakshi
కందుకూరు పోలీస్‌స్టేషన్‌లో కేఏ పాల్‌ ఫిర్యాదు  

సాక్షి, కందుకూరు: రోడ్డు షోలో 8 మంది మృతికి కారణమైన చంద్రబాబుపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని పామూరు బస్టాండ్‌ సెంటర్‌ వద్ద బుధవారం రాత్రి జరిగిన ఘటన స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు.

అనంతరం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్‌ మాట్లాడుతూ డబ్బులు, మందు, బిర్యానీ పంచి ప్రజలను తీసుకొచ్చి రెండు వేల మంది పట్టే స్థలంలో సభ పెట్టి 8 మందిని బలితీసుకున్న చంద్రబాబుపై కేసు ఎందుకు నమోదు చేయరని ప్రశ్నించారు. వెంటనే 304 ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు దీనికి బాధ్యత వహించి టీడీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన హయాంలో రాష్ట్రం ఏం అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసన్నారు.   

కేఏ పాల్‌పై దాడికి యత్నం  
కేఏ పాల్‌ మీడియాతో మాట్లాడుతుండగా టీడీపీ యువకులు ముగ్గురు ఆయనపై దాడికి యత్నించారు. పోలీసులు రంగప్రవేశం చేసి యువకుల బారి నుంచి పాల్‌ను రక్షించి ఆయనను అక్కడి నుంచి పంపించి వేశారు.   

మరిన్ని వార్తలు