కోర్టులో కేఏ పాల్‌ హల్‌చల్‌

17 Dec, 2022 09:42 IST|Sakshi

విశాఖ లీగల్‌: జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ హల్‌చల్‌ చేశారు. విశాఖలోని 4వ అదనపు జిల్లా కోర్టుకు ఒక కేసులో ప్రతివాదిగా వచ్చిన ఆయన న్యాయమూర్తితో స్వయంగా మాట్లాడేందుకు ప్రయత్నంచారు. అందుకు న్యాయమూర్తి సున్నితంగా తిరస్కరించారు. వ్యక్తిగత న్యాయవాదితో రావాలని న్యాయమూర్తి పాల్‌కు సూచించారు. కేఏ పాల్‌కు సంబంధించిన కేసును న్యాయమూర్తి విచారించి, వాయిదా వేశారు.

అనంతరం కేఏ పాల్‌ కోర్టు బయట విలేకర్లతో మాట్లాడారు. దేశం అవినీతిమయంగా మారిందన్నారు. 2007 నుంచి తన కేసు నడుస్తున్నా వాయిదాలు తప్ప పురోగతి లేదన్నారు. కేసును కొట్టివేయాలని ఉన్నత న్యాయస్థానాలు 2014లో చెప్పినా స్పందన లేదన్నారు. గత 16 ఏళ్ల నుంచి 700 సార్లు కేసును వాయిదా వేస్తూ వస్తున్నారన్నారు. కేసు తీర్పు రాకపోవడంతో తాను వితంతువులకు, అనాథలకు సేవ చేయలేక పోతున్నానన్నారు. అవినీతికి మద్దతు పలుకుతున్న న్యాయవాదులు తీరు మార్చుకోవాలన్నారు. ఈవీఎంలు మార్చి టీఆర్‌ఎస్, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని తెలిపారు. ప్రజాపాలన కావాలంటే ప్రజాశాంతి పాలన రావాలన్నారు.   

మరిన్ని వార్తలు