దేశంలోనే కడప బెటాలియన్‌కు ప్రత్యేక స్థానం 

16 Apr, 2021 11:42 IST|Sakshi
డ్రిల్‌ స్క్వేర్‌ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న తిరుపతి గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ గంగా సతీష్‌

ఎన్‌సీసీ హబ్‌గా తీర్చిదిద్దుతాం

తిరుపతి గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ గంగా సతీష్‌ 

రూ.54 లక్షలతో డ్రిల్‌ స్క్వేర్‌ నిర్మాణానికి భూమిపూజ 

వైవీయూ: కడప 30 ఆంధ్రా బెటాలియన్‌కు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రత్యేకస్థానం ఉందని తిరుపతి ఎన్‌సీసీ గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ గంగా సతీష్‌ అన్నారు. గురువారం కడప ఎన్‌సీసీ నగర్‌లోని 30 ఆంధ్రా బెటాలియన్‌లో ఎన్‌సీసీ కేడెట్స్‌ డ్రిల్‌కోసం రూ.54 లక్షల నిధులతో నిర్మించనున్న డ్రిల్‌ స్క్వేర్‌ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్నల్‌ గంగా సతీష్‌ మాట్లాడుతూ కడప నగరంలోని 30 ఆంధ్రా బెటాలియన్‌ అన్ని సౌకర్యాలతో బాగుందన్నారు. ఎన్‌సీసీ హబ్‌గా కడపను తీర్చిదిద్దేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే ఆలిండియా ట్రెక్కింగ్‌ క్యాంపులు, ఏక్‌భారత్‌.. శ్రేష్ట్‌భారత్‌ క్యాంపులను సైతం ఇక్కడే కేటాయించామన్నారు. జాతీయస్థాయిలో తిరుపతి గ్రూప్‌ పరిధిలోని ఎన్‌సీసీ కేడెట్స్‌ ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. కోవిడ్‌–19 కారణంగా అనుకున్న ప్రణాళికల ప్రకారం పూర్తిస్థాయి అభివృద్ధి సాధ్యం కాలేదని, కోవిడ్‌ తగ్గిన వెంటనే మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయన్నారు. జిల్లా కలెక్టర్‌ సి. హరికిరణ్‌ ఎన్‌సీసీ బెటాలియన్‌ అభివృద్ధికి చక్కటి సహకారం అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్‌సీసీ కేడెట్స్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చక్కటి ప్రోత్సాహం అందిస్తున్నారని పేర్కొన్నారు. 

జై జవాన్‌ నుంచి జైకిసాన్‌కు.. 
దేశానికి సేవచేసే అవకాశం లభించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తిరుపతి గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ గంగా సతీష్‌ అన్నారు. పలు యుద్ధాల్లో పాల్గొని ప్రస్తుతం ఎన్‌సీసీకి సేవలందించడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు జైజవాన్‌ పాత్రలో ఉన్న నేను మేనెల నుంచి స్వచ్ఛంద పదవీవిరమణ చేసి జైకిసాన్‌గా మారతానన్నారు. 30 ఆంధ్రా బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ దినేష్‌కుమార్‌ ఝా మాట్లాడుతూ తెలుగువ్యక్తి గ్రూప్‌ కమాండర్‌గా ఉండటంతో పాటు కడప బెటాలియన్‌ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందించారన్నారు. అనంతరం ఈనెలాఖరున పదవీ విరమణ చేయనున్న కల్నల్‌ గంగా సతీష్‌ను ఎన్‌సీసీ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారులు మేజర్‌ సి. విజయభాస్కర్, జి. చక్రధర్, పి.వి. సుబ్బారెడ్డి, డా. ఆర్‌. నీలయ్య, ఎం. వివేకానందరెడ్డి, మహేష్, సూర్యనారాయణరెడ్డి, ఇమాంఖాసీం, జయచంద్ర, ఎన్‌సీసీ సిబ్బంది శంకర్, శివప్రసాద్, చలమారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
ఆరుగురి దారుణ హత్య వెనుక కారణలివేనా?!  
కరోనా: ఒంటరితనం.. ఆపై వెన్నాడిన భయం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు