ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!

30 Aug, 2022 13:07 IST|Sakshi
మల్లేల గ్రామం కొండరాయితో ఆళ్లగడ్డలో తయారు చేసిన దేవతామూర్తుల విగ్రహాలు

తొండూరు మండలం మల్లేల వద్ద బొమ్మరాయి

రాయితో ఆళ్లగడ్డ వద్ద దేవతామూర్తుల తయారీ 

మనిషిని దేవుడు సృష్టించినట్లు పలువురు విశ్వసిస్తున్నారు. అయితే దేవుడి రూపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. పేరు తలవగానే ఆ రూపం కళ్లముందు కదలాడే విధంగా శిలా ప్రతిమలను తీర్చిదిద్దుతున్నారు పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన కళాకారులు. ఈ గ్రామం వద్ద ఉన్న నానుబాయి కొండ ప్రాంతంలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నల్లటి రాతి శిలలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి నాణ్యంగా, దేవతామూర్తుల విగ్రహాల తయారీకి అనువుగా ఉండడంతో పలు ప్రాంతాలకు చెందిన శిల్పులు శిలలను చెక్కి విక్రయిస్తున్నారు. కొందరు బండలాగుడు పోటీలకు పెద్ద బండరాళ్లను ఇక్కడి నుంచే తీసుకెళుతుంటారు. ఇక్కడి శిల్పులు, శిల్పళానైపుణ్యంపై సాక్షి ప్రత్యేక కథనం..  


సాక్షి ప్రతినిధి, కడప (వైఎస్సార్‌ జిల్లా) :
తొండూరు మండలం మల్లేలలో ఉన్న వడ్డెర కుటుంబాలు  శతాబ్దాలుగా గుట్ట నుంచి రాయిని వెలికి తీయడం వృత్తిగా చేసుకున్నాయి. విగ్రహాలకు రాళ్లు అనువుగా ఉండడంతో ఆ రాళ్లను ఇతర ప్రాంతాల్లోని శిల్పులకు విక్రయిస్తున్నారు. ప్రధానంగా ఆళ్లగడ్డతోపాటు పలు ప్రాంతాల్లోని శిల్పులు ఇక్కడి నుంచే రాయిని తీసుకెళుతున్నారు. స్థానికంగానే కాకుండా ఇతర జిల్లాలలో గుడుల నిర్మాణంతోపాటు గుడుల స్తంభాలు, దేవతామూర్తుల విగ్రహాలు, ఇతర అవసరాల కోసం కూడా తీసుకెళుతుంటారు. రాయిని ఇక్కడి వడ్డెరలు అడుగు చొప్పున విక్రయిస్తున్నారు. 


ప్రధానంగా నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డకు చెందిన శిల్పులు మల్లేల గ్రామం నానుబాయి కొండ నుంచి ఎక్కువగా రాయిని తీసుకెళుతున్నారు. ఈ రాతితో వినాయకుడు, లక్ష్మిదేవి, సరస్వతిదేవి, శ్రీకృష్ణుడు, సీతారామ, లక్ష్మణుల విగ్రహాలు, గ్రామ దేవతల విగ్రహాలు సైతం తయారు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. ఇటీవలే మల్లెల కొండ నుంచి ఆంజనేయస్వామి విగ్రహం కోసం 45 అడుగుల పొడువున్న రాయిని మైసూరుకు చెందిన వారు తీసుకెళ్లారు. దేవతామూర్తుల విగ్రహాలే కాకుండా బండలాగుడు పోటీలకు ఉపయోగించే పెద్ద బండరాళ్లు, కంకల గుండ్లు సైతం ఈ రాయితో ఇక్కడి వడ్డెరలు తయారు చేస్తున్నారు. ఇవేకాకుండా రోళ్లు, విసురు రాళ్లు, రుబ్బు రాళ్లు తదితర వాటిని సైతం తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. 


ఈ గ్రామంలో ఉన్న ఎనిమిది వడ్డెర కుటుంబాలకు ఇదే వృత్తి. పొద్దునే వెళ్లి కొండ గుట్టపై మట్టిని తొలగించి రాళ్లను వెలికి తీస్తున్నారు. వెలికి తీసిన రాళ్లను అడుగు రూ. 75 చొప్పున విక్రయిస్తున్నారు. వడ్డెర మహిళలు సైతం పురుషులకు తోడుగా ఇదే పనిలో ఉంటున్నారు. పెద్ద రాళ్లను విగ్రహాలు, ఇతర వాటికి విక్రయించగా, చిన్న రాళ్లను విసురురాళ్లు, రోళ్లు తదితర వాటిని వీళ్లే మొలిచి అమ్ముకుంటున్నారు. 


లీజుతో తవ్వకాలు 

10 ఎకరాల్లో నానుబాయి కొండను స్థానిక వడ్డెరలే సొసైటీ ద్వారా లీజుకు తీసుకున్నారు. భూమి నుండి ప ది అడుగులలోతు వరకు ఇక్కడ రాతి పొరలు ఉన్నా యి. పూర్వం నుంచి ఇదే వృత్తిలో ఉన్నట్లు వడ్డెరలు చెబుతున్నారు. పెద్దల నుంచి వచ్చిన వారసత్వంగా ఇప్పటికే రాళ్లు తీసి అమ్ముకోవడమే వృత్తిగా బ్రతుకుతున్నట్లు చెప్పారు. తమకు వ్యవసాయ భూములు లేవని, రాయి తీసి అమ్ముకోవడం, చిన్నరాళ్లను మొలిచి విక్రయించుకోవడమే వృత్తిగా బతుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. రోజుకు రూ. 400–500లోపు కూలీ మాత్రమే పడుతున్నట్లు తెలిపారు. రాయి నాణ్యంగా ఉండడంతో శిల్పాలకు పనికి వస్తోందని, ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి రాయిని తీసుకెళుతున్నట్లు వారు వివరించారు. గ్రామాల్లో గుడులు నిర్మించేవారు, వారికి అవసరమైన రాయిని తరలించుకుని ఇక్కడి నుంచే తీసుకెళుతుంటారని వడ్డెర్లు చెబుతున్నారు. (క్లిక్‌: లక్షల్లో వేతనాలు వదిలిన జంట.. ‘పంట’ భద్రులైంది!)


దేవతా విగ్రహాలకు ఇక్కడి రాయే తీసుకెళతారు 

దేవతామూర్తుల విగ్రహాలు చేసేందుకు శిల్పులు మా మల్లేల గ్రామం వద్దనున్న నానుబాయి కొండ రాయినే తీసుకు వెళతారు. శిల్పులకు అవసరమైన రాయిని మేము తవ్వితీసి అడుగు లెక్కన విక్రయిస్తాం. చాలామంది గుడులు నిర్మించేవారు కూడా రాయిని తీసుకెళతారు. పెద్దరాళ్లను విక్రయించి చిన్న రాళ్లను రోళ్లు, విసురు రాళ్లు తదితర వాటిని మేమే మొలిచి విక్రయిస్తుంటాం. మా పూర్వీకుల నుండి ఇప్పటివరకు ఇదే వృత్తితో జీవిస్తున్నాము. 
– కుంచెపు వీరభాస్కర్, మల్లేల గ్రామం 


పూర్వం నుంచి ఇదే వృత్తి 

మా పూర్వీకులు ఇక్కడి రాయిని వెలికితీసి దేవతామూర్తుల విగ్రహాల తయారీకి అమ్మేవారు.ప్రస్తుతం మేము అదే చేస్తున్నాం. గ్రామం వద్దనున్న నానుబాయి కొండ ప్రాంతాన్ని లీజు ద్వారా తీసుకుని రాయిని వెలికి తీసి అడుగు చొప్పున విక్రయిస్తుంటాం. ఆళ్లగడ్డ, ఇతర ప్రాంతాలవారు ఇక్కడి నుంచే రాయిని తీసుకెళతారు. ఈ రాయితోనే విగ్రహాలను, రుబ్బురోళ్లు తయారు చేస్తారు. 
– కుంచెపు చిన్న లింగన్న, మల్లేల గ్రామం  

మరిన్ని వార్తలు