‘నా భర్తను ఇండియాకు పిలిపించండి.. అన్యాయంగా ఇరికించారు’

12 Mar, 2022 16:22 IST|Sakshi

అన్యాయంగా కేసులో ఇరికించారు

కువైట్‌ హత్యల కేసులో అరెస్టయిన పిలోళ్ల వెంకటేష్‌ భార్య స్వాతి విజ్ఞప్తి 

సాక్షి, కడప అర్బన్‌: దేశం కాని దేశంలో బతుకుదెరువుకోసం వెళ్లిన తన భర్తను కువైట్‌ వాసులు ఒకే కుటుంబానికి చెందిన మూడు హత్యకేసుల్లో అన్యాయంగా ఇరికించారని, ఎలాంటి శిక్ష పడనీయకుండా తన భర్తను ఇండియాకు రప్పించి న్యాయం చేయాలని వెంకటేష్‌ భార్య స్వాతి విజ్ఞప్తి చేసింది. వైఎస్సార్‌ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు కస్పాకు చెందిన పిలోళ్ల శ్రీరాములు కుమారుడు వెంకటేష్‌ కువైట్‌లో ఓ సేఠ్‌ వద్ద టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్దియా పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన సేఠ్‌ అహ్మద్‌ (80), అతని భార్య కాల్దా (62) కుమార్తె అసుమ (18)ను దారుణంగా హత్య చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసి అక్కడి జైల్లో ఉంచారు.

ఆయన భార్య స్వాతి కూడా కువైట్‌లోని ఓ న్యాయవాది ఇంట్లో పనిచేస్తోంది. అయితే న్యాయవాది సహాయంతో ఈ నెల 10న కువైట్‌ నుంచి వైఎస్సార్‌ జిల్లాకు వచ్చిన వెంకటేష్‌ భార్య స్వాతి శుక్రవారం తన పిల్లలు జయవర్ధన్, విష్ణువర్ధన్, అత్తామామలు శ్రీరాములు, రమణమ్మ, కుటుంబసభ్యులతో కలిసి కడపలోని కలెక్టరేట్‌కు వచ్చారు. దీంతో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి వారివద్దకు వచ్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, అమాయకుడైన తన భర్త వెంకటేష్‌ను ప్రభుత్వం చొరవ తీసుకుని కాపాడి ఇండియాకు రప్పించాలని కలెక్టర్‌ వి.విజయకుమార్‌ రాజుకు స్వాతి విజ్ఞప్తి చేసింది. స్పందించిన కలెక్టర్‌ ప్రభుత్వానికి, విదేశాంగశాఖకు విషయాన్ని వివరిస్తూ వినతిపత్రాన్ని పంపిస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు