‘సీబీఐ ఏకపక్షంగా విచారణ చేస్తోంది’

10 Mar, 2023 12:23 IST|Sakshi

కడప(వైఎస్సార్‌ జిల్లా): వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ ఏకపక్షంగా విచారణ చేస్తోందని కడప మేయర్‌, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు సురేష్‌బాబు ఆరోపించారు. కేవలం ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని ఇరికించేందుకు సీబీఐ కుట్ర చేస్తోందని సురేష్‌ బాబు పేర్కొన్నారు.  ఈ కేసులో కీలక వ్యక్తి అయిన దస్తగిరికి సీబీఐ మద్దతు ఇస్తోందన్న సురేష్‌ బాబు.. అప్రూవర్‌ పేరుతో సీబీఐ మద్దతు ఇవ్వడంతో అతను బెయిల్‌పై బయట తిరుగుతున్నాడన్నాడన్నారు.

శుక్రవారం సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ..‘విచారణను వీడియో రూపంగా, న్యాయవాది సమక్షంలో చేయాలని మాత్రమే ఎంపీ కోరారు. దీనిపై కూడా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. అభూత కల్పనలు ప్రచురితం చేయడం, లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు ప్రసారాలు చేయడం బాధాకరం. విచారణకు ఎంపీ వైఎస్ అవినాష్ ఇతర కుటుంబ సభ్యులు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఒకరికి సహాయం చేసే గుణం వైఎస్ కుటుంబానిది, అంతే కాని విచారణ తప్పించుకుని తిరగడం లేదు. సీబీఐ అంటే మంచి నమ్మకం ఉంది.. అలాంటి మంచి నమ్మకం కోల్పోకుండా విచారణ చేయాలి. ఒక్క అబద్ధాన్ని పదే పదే నిజం అని చెప్పడం ప్రసారాలు చేయడం ఏంటి’ అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు