మహిమాన్విత సూఫీ క్షేత్రం.. కడప అమీన్‌పీర్‌ దర్గా

5 Dec, 2022 16:51 IST|Sakshi

డిసెంబర్ 6 నుంచి ఉరుసు ఉత్సవాలు పారంభం

అడుగడుగునా ప్రశాంతత ఉట్టిపడే పవిత్రభూమి అది 
ఆధ్యాత్మిక శిఖరంగా విశ్వఖ్యాతిగాంచిన ప్రాంగణమది 
ఎందరో మహానుభావులు కొలువైన పుణ్యవాటిక అది 
భక్తుల కొంగుబంగారమై విలసిల్లుతున్న సూఫీ క్షేత్రమది 
అదే.. కడప నగరంలోని ప్రఖ్యాత అమీన్‌ పీర్‌ (పెద్ద) దర్గా..  
ప్రధాన ఉత్సవానికి ముస్తాబవుతోంది.. త్వరత్వరగా!  
ఇపుడా సన్నిధిలో..   
ఉరుసుకు వేళయింది రారండంటూ.. 
ఆహ్వానిస్తున్న సు‘గంధ’ పరిమళాలు 
వేడుకను కనులారా చూద్దామంటూ..  
కదిలొస్తున్న ‘చాంద్‌ సితారే’లు  
‘అయ్‌.. మాలిక్‌ దువా ఖుబూల్‌ కరో’ 
అంటూ దగ్గరవుతున్న చేతులు 
అందరి మనసుల్లో ప్రతిధ్వనిస్తున్న 
‘ఆమీన్‌.. ఆమీన్‌’ పలుకులు

కడప  కల్చరల్‌ :  ఆధ్యాత్మిక చింతనకు... మత సామరస్యానికి మారుపేరు కడప అమీన్‌పీర్‌ దర్గా. ప్రశాంతతకు నిలయంగా జాతీయ స్థాయిలో ఖ్యాతి గాంచిన పెద్దదర్గా గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతోంది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ప్రధాన ఉరుసు ఉత్సవాలకు దర్గా సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఇప్పటికే విద్యుద్దీప కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతోంది. పలు ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో దర్గా ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది.


కడప నగరంలోని అమీన్‌పీర్‌ (పెద్ద) దర్గా జాతీయ స్థాయిలో విశిష్ట ఖ్యాతి పొందింది. దశాబ్దాలపాటు కఠోరమైన తపస్సు చేసిన దివ్య గురువులకు దర్గా నిలయంగా మారింది. ఇక్కడ గురువులు జీవ సమాధి కావడంతో మహిమాన్విత క్షేత్రంగా విలసిల్లుతోంది. దర్గాలో ప్రార్థనలు చేసి తమ సమస్యలు చెప్పుకుంటే తప్పక మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఏటా జరిగే ఉత్సవాలలో మతాలకతీతంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటుంటారు. ఈ దర్గా మతసామరస్యానికి, జాతీయ సమైక్యతకు మారుపేరుగా నిలుస్తోంది. 


మహిమాన్విత క్షేత్రం 

16వ శతాబ్దంలో కర్ణాటకలోని బీదర్‌ ప్రాంతం నుంచి మహా ప్రవక్త మహమ్మద్‌ వంశీకులైన ఖ్వాజా యే ఖ్వాజా.. నాయబే రసూల్‌ అతాయే రసూలుల్లా హజరత్‌ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మాలిక్‌ సాహెబ్‌ తన సతీమణితో పాటు కుమారులు హజరత్‌ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్, హజరత్‌ అహ్మద్‌ హుసేనీ సాహెబ్‌లు పలువురు శిష్యగణంతో ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు.  


జీవ సమాధి 

హజరత్‌ పీరుల్లా మాలిక్‌ ఆధ్యాత్మిక బోధనలు చేయడంతో పాటు ఎన్నో మహిమలు చూపేవారు. అనతి కాలంలోనే మాలిక్‌ పట్ల పెద్ద సంఖ్యలో విశ్వాసం చూపడం, వారి సంఖ్య పెరుగుతుండటంతో గిట్టనివారికి కన్నుకుట్టింది. పీరుల్లా మాలిక్‌కు మహిమలే ఉంటే జీవసమాధి అయి మూడో రోజు సజీవంగా కనిపించాలని సవాల్‌ విసిరారు. దాన్ని చిరునవ్వుతో స్వీకరించిన ఆయన మొహర్రం పదో రోజు (షహదత్‌) తన పెద్ద కుమారుడు హజరత్‌ ఆరీఫుల్లా హుసేనీకి బాధ్యతలు అప్పగించి వందలాది మంది చూస్తుండగా సమాధిలోకి వెళ్లారు. మూడో రోజు సమాధి తెరిచిన వారికి అందులో ఆయన నమాజు చేస్తూ కనిపించారు. ఆయన శక్తిని ప్రత్యక్షంగా చూసిన గిట్టనివారు సైతం శిష్యులుగా మారారు. అనంతరం దర్గా బాధ్యతలు పెద్ద కుమారుడు హజరత్‌ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ చేపట్టగా, చిన్న కుమారుడు హజరత్‌ అహ్మద్‌ హుసేనీ సాహెబ్‌ నందలూరు కేంద్రంగా ఆధ్యాత్మిక ప్రయాణం సాగించారు. 


మహా తపస్వి 

దర్గాను వ్యవస్థీకరించింది హజరత్‌ సయ్యద్‌షా పీరుల్లా మాలిక్‌ అయినా ఇక్కడి పెద్ద ఉరుసు మాత్రం సూఫీ సర్‌ మస్తాని ఆరీఫుల్లా మహమ్మద్‌ మహమ్మదుల్‌ హుసేనీ సాహెబ్‌ పేరిటే జరుగుతోంది. వీరు 40 ఏళ్లకు పైగా తాడిపత్రి అడవుల్లో, మిగతా 23 ఏళ్లు  శేషాచల అడవుల్లో కఠోర తపస్సు చేశా రు.  భక్తులు తొలుత ప్రధాన గురువులైన హజరత్‌ పీరుల్లా మాలిక్‌ సాహెబ్‌ను దర్శించుకుని తర్వాత హజరత్‌ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌తో పాటు హజరత్‌ అమీనుల్లా హుసేనీ సాహెబ్, ఇతర గురువుల మజార్లను దర్శించుకుంటారు. 


11వ పీఠాధిపతి ఆధ్వర్యంలో.. 

దర్గాకు ప్రస్తుతం హజరత్‌ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ 11వ పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఆయన చిన్న వయస్సులోనే అనేక మత గ్రంథాలను అధ్యయనం చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధించడం విశేషం. శిష్య కోటికి ఈయన కొంగు బంగారంగా నిలిచారు. మానవతా వాదానికి మారుపేరుగా నిలుస్తున్న ఆయన హయాంలోనే దర్గా విశేషంగా అభివృద్ధి చెందింది. కులమతాలకతీతంగా  పీఠాధిపతి పట్ల భక్తుల్లో ఎనలేని గౌరవభావం నెలకొంది.  


కవిగా గురువులు

ఆధ్యాత్మిక గురువుగానే కాకుండా కవిగా కూడా ప్రస్తుత దర్గా పీఠాధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ పేరు గడించారు. ‘అల్‌ రిసాలా’ సినిమాలో ఆయన ‘మర్‌హబా.. యా ముస్తఫా’ అనే నాత్‌ గీతాన్ని రాశారు. అది పెద్ద విజయం సాధించింది. అనంతరం ‘జుగ్ని’ సినిమాలో ఖాసిఫ్‌ పేరిట ఆయన ‘లాఖో సలాం’ పాట రాశారు. ఈ రెండు గీతాలను ఏఆర్‌ రెహ్మాన్‌ స్వీయ సంగీత నిర్వహణలో ఆలపించారు.  ఇవేకాకుండా అనేక నాత్‌ సూఫీ గీతాలను రచించారు. ఇవి డీవీడీలు తదితర రూపాల్లో భక్తులకు అందుబాటులో ఉన్నాయి.  అటు ఆధ్మాత్మిక సందేశాలు..  ఇటు కవితాత్మక రచనలతో ఆయన ప్రత్యేకత చాటారు.


సినీ నటుల సందడి 

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ తన కుటుంబంతో ఏడాదికి కనీసం ఆరేడుసార్లు దర్గాను దర్శిస్తారు. బాలీవుడ్‌ స్టార్లు అభి షేక్, ఐశ్వర్యబచ్చన్, అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌లతో పాటు మరెందరో తెలుగు, తమిళ సినీ ప్రముఖులు.. రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రజాప్రతినిధులు కూడా ఈ దర్గాను దర్శిస్తుంటారు. 

సేవలకు మారు పేరుగా 
దర్గా పెద్దల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. పేద ముస్లిం యువతులకు కుట్టు, అల్లికల్లో శిక్షణ.. యువకులకు ఐటీఐ ద్వారా వృత్తి విద్యలు నేర్పుతున్నారు. అమీన్‌ బ్లడ్‌ గ్రూప్‌ పేరిట రక్తదానం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు