కడప స్టీల్‌ ప్లాంట్‌.. భూమి పూజకు సర్వం సిద్ధం

14 Feb, 2023 08:11 IST|Sakshi

సాక్షి, అమరావతి:  సీమవాసుల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ రూ.8,800 కోట్లతో 30 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో జేఎస్‌డబ్ల్యూ గ్రూపు వైఎస్సార్‌ కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో ఏర్పాటు చేస్తున్న స్టీల్‌ ప్లాంట్‌ పనులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ కూడా పాల్గొంటారు.

2019లో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ పేరుతో ముఖ్యమంత్రి స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేయడంతో రెండేళ్లు పనులు జరగలేదు. కోవిడ్‌ సంక్షోభానికి భయపడి పలు సంస్థలు పెట్టుబడి ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. ఇప్పుడు రూ.1,76,000 కోట్ల  (22 బిలియన్‌ డాలర్లు) మార్కెట్‌ విలువ కలిగి, ఏటా 27 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తున్న జేఎస్‌డబ్ల్యూ కంపెనీ కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టింది. దీంతో పనులు చకచకా జరగనున్నాయి.

ఈ సంస్థకు ప్రభుత్వం దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన భూములు కేటాయించింది. జేఎస్‌డబ్ల్యూ సంస్థ తొలి విడతలో రూ.3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్‌ ఏర్పాటు చేస్తుంది. రెండో విడతలో మరో 20 లక్షల టన్నులు ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్‌ను విస్తరిస్తుంది. మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో పరిశ్రమ అందుబాటులోకి తెస్తుంది. నిర్మాణం ప్రారంభించిన 36 నెలల్లో తొలి దశ అందుబాటులోకి తేవాలని జేఎస్‌డబ్ల్యూ లక్ష్యంగా నిర్దేశించుకుంది.  

రూ.700 కోట్లతో మౌలిక వసతుల కల్పన 
రాయలసీమ వాసులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ఈ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తోంది. ఈ ప్లాంట్‌ను జాతీయ రహదారి 67కు అనుసంధానిస్తూ 7.5 కిలోమీటర్ల అప్రోచ్‌ రోడ్డు నిర్మిస్తోంది. ప్రొద్దుటూరు – ఎర్రగుంట్ల రైల్వే లైన్‌కు అనుసంధానిస్తూ 10 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్‌ ఏర్పాటు చేయనుంది. మైలవరం రిజర్వాయర్‌ నుంచి రెండు టీఎంసీల నీటిని సరఫరా చేసేలా  ప్రత్యేక పైప్‌లైన్‌ నిర్మిస్తోంది. 

గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనూ పెట్టుబడులు 
గ్రీన్‌ ఎనర్జీ రంగంలో కూడా జేఎస్‌డబ్ల్యూ పెట్టుబడులు పెట్టనుంది. 2.5 మెట్రిక్‌ ట­న్నుల డీఆర్‌ఐ ప్లాంట్, 1000 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్‌ ప్లాంట్, 3,000 మెగావాట్ల సోలార్, విండ్, పంప్డ్‌ హైడ్రోస్టోరేజ్‌ వంటి ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. బ్యాటరీ స్టోరేజ్, హైడ్రోజన్‌ స్టోరేజ్‌ కేంద్రాలనూ ఏర్పాటు చేయనుంది.   

మరిన్ని వార్తలు