కడియం మొక్కల ఎగుమతులకు ప్రత్యేక ప్రణాళిక

17 Jan, 2023 11:12 IST|Sakshi

ప్రస్తుతం కడియం నుంచి రూ. 5.5 కోట్ల విలువైన మొక్కల ఎగుమతి 

ఏడు దేశాలకే ఎగుమతులు

2024–25 నాటికి రూ.7.4 కోట్లకు చేర్చాలని లక్ష్యం      

కడియం రైతులకు ఎగుమతులపై అవగాహన 

నైపుణ్యం పెంచేందుకు స్కిల్‌ హబ్స్‌ ద్వారా శిక్షణ  

సాక్షి, అమరావతి: అందమైన పూల, అలంకరణ పూల మొక్కలకు ప్రఖ్యాతి గడించిన కడియం నర్సరీ ఇప్పుడు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఎగుమతి విధానాలు, ధ్రువపత్రాలు, నాణ్యతపై నర్సరీ రైతులకు అవగాహన కల్పించడం, నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా విదేశాలకు అవరమైన మొక్కలను పెంచి, ఎగుమతులు పెంచుకుంటారని అధికారులు చెబుతున్నారు. తద్వారా రైతుల ఆదాయం పెరుగతుందని తెలిపారు. 

నర్సరీకి అవసరమైన గాలిలో తేమ, ఉష్ణోగ్రతలు, సారవంతమైన భూమి ఉన్న కడియం చుట్టుపక్కల సుమారు 15 కి.మీ పరిధిలో 7,000 ఎకరాల్లో నరర్సరీలు ఏర్పాటయ్యాయి. ప్రతి ఏటా డిమాండ్‌కు అనుగుణంగా నర్సరీ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కడియం చుట్టుపక్కల సుమారు 2,300 నర్సరీలు ఉండగా, వీటిలో 15 సంస్థలు మాత్రమే ఎగుమతులకు లైసెన్సులు కలిగి ఉన్నాయి. 1,600 నర్సరీలు అసంఘటిత రంగంలోనే ఉన్నాయి. దీనివల్ల ఎగుమతులు పెరగడంలేదని అధికారులు భావిస్తున్నారు.

దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ కోట్ల వ్యాపారం చేస్తున్న కడియం నర్సరీ రైతులు సరైన అవగాహన లేక అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా నర్సరీల నుంచి రూ.229 కోట్ల విలువైన మొక్కలు ఎగుమతి అవుతుండగా, ఎంతో పేరెన్నికగన్న కడియం నుంచి తక్కువ మొత్తంలో ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం కడియం నుంచి ఏడు దేశాలకు ఏటా రూ.5.5 కోట్ల విలువైన మొక్కలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి.

వచ్చే మూడేళ్లలో.. అంటే 2024–25కి ఈ మొత్తాన్ని రూ.7.4 కోట్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం తూర్పు గోదావరి జిల్లా ఎగుమతుల కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం స్వాట్‌ అనాలసిస్‌ (స్ట్రెంగ్త్, వీక్‌నెస్, ఆపర్చునిటీస్, త్రెట్‌) చేసి దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ (ఎగుమతులు) జీఎస్‌ రావు ‘సాక్షి’కి వివరించారు. రాష్ట్రం నుంచి ఎగుమతికి బాగా అవకాశాలున్న ఒమన్, కువైట్, బెహ్రయిన్, మాల్దీవులు, ఖతార్, టర్కీ, యూఏఈకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. అక్కడి మార్కెటింగ్‌కు అనుగుణంగా ఇక్కడి రైతులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. 

ఇదీ ప్రణాళిక 
అసంఘటిత రంగంలో ఉన్న నర్సరీలన్నింటినీ సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ ద్వారా ఒక తాటిపైకి తెస్తారు. ఇతర దేశాల మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎగుమతి లైసెన్సులు ఉన్న వారిలోనూ చాలా మంది నాణ్యత సర్టిఫికేషన్స్‌ వంటి వాటిపై అవగాహన లేకపోవడంతో అవకాశాలను అందిపుచ్చుకోవడంలేదు. వీరందరికీ జిల్లా ఎక్స్‌పోర్ట్స్‌ హబ్‌ ద్వారా శిక్షణ ఇస్తామని అధికారులు వెల్లడించారు. 

► తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసే విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పథకాల ప్రయోజనాలను వివరిస్తారు.  
► 2022–27 రాష్ట్ర ఎగుమతి ప్రోత్సాహక విధానం కింద పలు ప్రోత్సాహకాలను ఇస్తారు. విదేశీ ప్రదర్శనల్లో పాల్గొనే వారికి 30 శాతం అద్దె రాయితీ, ఎగుమతుల్లో కీలకమైన జెడ్‌ఈడీ సర్టిఫికెట్‌ పొందడంలో 10 శాతం రాయితీతో పాటు ఎగుమతి నాణ్యతకు సంబంధించిన ధృవపత్రాలు పొందడానికి అయ్యే వ్యయాల్లో 50 శాతం రాయితీ ఇస్తామని అధికారులు తెలిపారు.  
► దేశీయంగా రియల్టర్లు, ల్యాండ్‌ స్కేపర్స్, ఆర్కిటెక్చర్స్‌కు అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు, మొక్కల సరఫరాపై అవగాహన కల్పిస్తారు.  
► ఇండోర్, ఔట్‌డోర్‌ గార్డెన్స్‌లో చూపు తిప్పుకోలేని విధంగా వివిధ ఆకృతుల్లో మొక్కలను పెంచేలా న­ర్సరీ రైతుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్‌ హబ్స్‌లోప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. 

మరిన్ని వార్తలు