శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కైశిక ద్వాదశి ఆస్థానం

27 Nov, 2020 13:10 IST|Sakshi

సాక్షి, తిరుమల: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం జరిగింది. తిరుమలలో వర్షం, ఈదురుగాలుల కారణంగా మాడ వీధుల్లో ఊరేగింపును టీటీడీ రద్దు చేసింది. ఉదయం 4.45 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఆలయంలో ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం స్వామి, అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంవత్సరంలో కైశిక ద్వాదశి నాడు మాత్రమే ఉగ్ర శ్రీనివాసుడు ఆలయం నుంచి వెలుపలికి వస్తారు. కానీ తుఫాను కారణంగా ఈ ఉత్సవం ఆలయానికే పరిమితం అయింది.   (వాయుగుండంగా బలహీనపడ్డ నివర్)

పర్వదినం ప్రత్యేకత..?
పురాణాల ప్రకారం శ్రీవైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశికద్వాదశి ఒకటి. వరాహ పెరుమాళ్ కైశికపురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది.  కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.  

మరిన్ని వార్తలు