సభ్యుల హక్కుల పరిరక్షణే ధ్యేయం 

1 Sep, 2021 05:30 IST|Sakshi

ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి 

అచ్చెన్నకు మరో అవకాశం.. 

కూన రవికుమార్‌ తీరు ధిక్కారమే 

సాక్షి, అమరావతి: శాసన సభ్యుల హక్కులను కాపాడటమే తమ ధ్యేయమని ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. కమిటీ అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రివిలేజ్‌ కమిటీ సమావేశంలో సభ్యులు ఎస్‌వీ చినఅప్పలనాయుడు, వి.వరప్రసాదరావు, మల్లాది విష్ణు, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సభ్యులతో కలసి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా నాలుగు అంశాలు చర్చించినట్లు చెప్పారు. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు గతంలో ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేనందున వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరామన్నారు. ఇప్పటికే రెండుసార్లు మినహాయింపు ఇచ్చామని, ఈసారి కచ్చితంగా వస్తానని లిఖితపూర్వకంగా లేఖ అందజేశారని తెలిపారు. సెప్టెంబర్‌ 14న వ్యక్తిగతంగా హాజరు కావాలని అచ్చెన్నాయుడుకు నోటీసు ఇవ్వనున్నట్లు చెప్పారు.  

నిమ్మగడ్డ వివరణ బట్టి తదుపరి చర్యలు.. 
టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినతి మేరకు పూర్తిస్థాయి వివరాలు అందచేసి పది రోజుల కాల పరిమితితో నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. టీడీపీ నేత కూన రవికుమార్‌ పలు సందర్భాలో స్పీకర్‌పై ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేయడంపై మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించామన్నారు. ఆయన కోసం చాలాసేపు వేచి చూశామని, రవికుమార్‌ గైర్హాజరు కావటాన్ని కమిటీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. కూన రవికుమార్‌ తీరును ధిక్కారంగా భావిస్తున్నామన్నారు. ఆయనపై చర్యలు తీసుకునే అంశంపై ప్రివిలేజ్‌ కమిటీలో నిర్ణయం తీసుకుని సభ ముందు ఉంచుతామని ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తన వ్యాఖ్యలు ఏ విధంగా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయో చెప్పాలని కోరడంతో ఆ వివరాలు పంపుతున్నామన్నారు. ఆయన వివరణ బట్టి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. 

మరిన్ని వార్తలు