ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి

18 May, 2022 04:59 IST|Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి 

సాక్షి, అమరావతి: రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యం తో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఆహార శుద్ధి పరిశ్రమల (సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల) ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆదేశించారు. తొలి దశలో ప్రతిపాదించిన యూనిట్లను నెల రోజుల్లో గ్రౌండింగ్‌ చేయడంతో పాటు వాటిని ఏడాదిలోగా పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఆహార ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసి మార్కెట్‌లోకి తీసుకొస్తే రైతుకు అదనపు ప్రయోజనం చేకూరుతుందన్నారు.  

21 చోట్ల భూసేకరణ పూర్తి
ఇప్పటికే 21 చోట్ల యూనిట్ల కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, తొలి దశలో 11 యూనిట్ల గ్రౌండింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు. గ్రౌండింగ్‌ చేయడం కాదని నెల రోజుల్లో అవి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. నిమ్మకాయల మార్కెట్‌ అయిన పొదలకూరు మార్కెట్‌ యార్డులో యాసిడ్‌ లైమ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమీక్షలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సీఈవో శ్రీధర్‌రెడ్డి, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రమేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు