కాకినాడ జిల్లా కలెక్టర్‌, జేసీ పెద్ద మనసు.. కోవిడ్‌తో అనాథలైన చిన్నారులను

31 May, 2022 15:31 IST|Sakshi
స్పందన కార్యక్రమంలో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ కృతికా శుక్లా, జేసీ ఇలక్కియ 

కాకినాడ సిటీ: కలెక్టరు కృతికాశుక్లా, జేసీ ఇలక్కియ పెద్ద మనసు చాటుకున్నారు. కోవిడ్‌తో అనాథలైన చిన్నారుల్లో తలో బిడ్డ బాధ్యతను స్వీకరించేందుకు ముందుకు వచ్చారు. వారికి సంబంధించిన అన్ని విషయాలు ఇకపై వీరు చూస్తారు. మిగిలిన అధికారులు కూడా చొరవ తీసుకుని తలో చిన్నారి దత్తత బాధ్యతలను తీసుకోవాలని కలెక్టర్‌ కృతికా శుక్లా కోరారు. సోమవారం కలెక్టరేట్‌ స్పందన హాలులో స్పందన అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్‌–19 కారణంగా 23 మంది చిన్నారులు అనాథలయ్యారన్నారు.
చదవండి: నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటాడేమో!

వీరి విషయంలో  జిల్లా స్థాయి మహిళా అధికారులు ఆలన, పాలన పరంగా చొరవ చూపాలని కలెక్టర్‌ కోరారు. మాతృత్వ భావనతో చిన్నారులు మహిళ అధికారులకు చేరువ అవుతారనే ఉద్దేశంతో తాము దత్తత బాధ్యత తీసుకున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. పురుష జిల్లా అధికారులు కూడా ఔదార్యంతో పిల్లల సంక్షేమానికి తమ వంతు సేవలను అందించవచ్చన్నారు.

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం 44 ల్యాప్‌టాప్‌లు, 19 స్మార్ట్‌ టచ్‌ ఫోన్‌లు, 300 హియరింగ్‌ ఎయిడ్‌లు, 40 కాలిపర్స్‌ పరికరాలు జిల్లా విభాగానికి కేటాయించామన్నారు. వీటికి అర్హులైన దివ్యాంగులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టి ఆన్‌లైన్‌ దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. సోమవారం స్పందన కార్యక్రమంలో ముగ్గురు బధిరులకు స్మార్ట్‌ టచ్‌ ఫోన్లను, ఒక దివ్యాంగుడికి మూడు చక్రాల సైకిల్‌ను జిల్లా కలెక్టర్‌ పంపిణీ చేశారు. స్పందనలో 237 అర్జీలు అధికారులకు అందాయి.

మరిన్ని వార్తలు