మేయరమ్మా... ఇదేంటమ్మా! 

8 Apr, 2021 10:54 IST|Sakshi
తిరుపతి ఎన్నికల ప్రచారంలో మేయర్‌ పావని(ఫైల్‌)   

కౌన్సిల్‌ తీర్మానాలపై తీవ్ర నిర్లక్ష్యం

బాధ్యతారాహిత్యమంటోన్న కార్పొరేటర్లు

కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌కు ఫిర్యాదు 

కాకినాడ: కౌన్సిల్‌ నిర్ణయాలను ‘తీర్మానం’ చేసే విషయంలో కాకినాడ మేయర్‌ సుంకర పావని వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోందంటూ కార్పొరేటర్లు ఎండగట్టారు. కౌన్సిల్‌ నిర్ణయాలను తీర్మానం చేయడంలో ఆమె చూపిస్తోన్న అలసత్వం సమస్యలకు తావిస్తోందంటూ ఆమెపై కార్పొరేషన్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు ఫిర్యాదు చేశారు.

అసలు ఏం జరిగిదంటే.. 
కాకినాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సాధారణ సమావేశం గత నెల 27న జరిగింది. బడ్జెట్‌తో పాటు 25కు పైగా అంశాలపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులను మరో ఏడాది కొనసాగింపుతో పాటు పలు అభివృద్ధి పనులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం ప్రకారం కౌన్సిల్‌ సమావేశం పూర్తయిన వెంటనే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ‘తీర్మానం’ రూపంలో నమోదు చేయాలి. ఆ వెంటనే సదరు తీర్మానాల వివరాలను నోటీసు బోర్డులో ఉంచి అమలు దిశగా సంబంధిత సెక్షన్లకు పంపాలి. అయితే కౌన్సిల్‌ సమావేశం జరిగి 10 రోజులు దాటినా ఈ ప్రక్రియ ముందుకు కదల్లేదు.

సమస్యలు గాలికొదిలి.. తిరుపతిలో ఎన్నికల ప్రచారం..  
కౌన్సిల్‌ నిర్ణయాలను ‘తీర్మానం’ చేయాల్సిన మేయర్‌ తన విధులను పక్కన పెట్టి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో కౌన్సిల్‌ తీర్మానాలు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. అదే రోజు చేయాల్సిన తీర్మానాలు పదిరోజులు గడుస్తున్నా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోవడంపై కార్పొరేటర్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. మేయర్‌ తీరు కౌన్సిల్‌ను అవమానించడమేనని మండిపడుతున్నారు. గతంలో కూడా తీర్మానాలు రాయడంలో జాప్యం జరిగి కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయాలకు, రాసిన తీర్మానాలకు తీవ్ర వ్యత్యాసాలు వచ్చాయంటున్నారు. ఇలా జాప్యం జరిగితే ఇక కౌన్సిల్‌ నిర్ణయాలకు పారదర్శకత ఎక్కడ ఉంటుందంటూ ప్రశ్నిస్తున్నారు.

కమిషనర్‌కు ఫిర్యాదు 
మేయర్‌ వ్యవహరశైలి, తీర్మానాల విషయంలో జరిగిన లోపాలపై స్టాండింగ్‌కమిటీ సభ్యులు జేడీ పవన్‌కుమార్, బాలప్రసాద్, చవ్వాకుల రాంబాబు, సీనియర్‌ కార్పొరేటర్లు చోడిపల్లి ప్రసాద్, ఎంజీకే కిశోర్, మీసాల ఉదయ్, నాయకులు సుంకర సాగర్‌ తదితరులు కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం కమిషనర్‌ను కలిసి మేయర్‌ తీరుపై లేఖ అందజేశారు. కార్పొరేటర్ల ఫిర్యాదు నేపథ్యంలో కమిషనర్‌ స్వప్నిల్‌దినకర్‌ సంబంధిత అధికారులతో మాట్లాడి వివరణ తీసుకున్నారు. లోపాలను సరిచేసి సమస్య పరిష్కరిస్తానని కార్పొరేటర్లకు ఆయన హామీ ఇచ్చారు.
చదవండి:
ఎవరికీ అనుమానం రాదు.. ఈ దొంగ ప్రత్యేకత ఇదే..
ఏపీకి కోటి డోసుల కోవిడ్‌ వ్యాక్సిన్‌!

మరిన్ని వార్తలు