కలర్‌ఫుల్‌.. ప్రూట్స్‌

29 May, 2022 20:10 IST|Sakshi

కడియం: పనస తొనలు తెలుపు లేత గోధుమ లేదా పసుపు రంగులో ఉండటం సహజమే. అవే తొనలు చూడగానే ఆకర్షించేలా ఆరెంజ్‌ కలర్‌లో ఉంటే ఆశ్చర్యమే. సీతాఫలాలు పైకి ఆకుపచ్చగా.. లోపల తెల్లటి గుజ్జుతో ఉండటం సహజమే. అవే ఫలాలు పైకి పింక్‌ కలర్‌లో కనిపిస్తే ‘ఎంత బాగున్నాయో’ అనిపించక మానదు. సాధారణంగా నేరేడు పండ్లు నల్లగా ఉంటాయి. అవే పండ్లు తెల్లగా ఉంటే..! సహజ సిద్ధంగా లభిస్తున్న ఫండ్లను ఇలా సరికొత్తగా అభివృద్ధి చేస్తూ నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు కడియం ప్రాంత నర్సరీ రైతులు. సాధారణంగా మనం చూసే పండ్లను భిన్నమైన రంగుల్లో కాసే అనేక రకాల మొక్కలను తమ నర్సరీల్లో అందుబాటులో ఉంచుతున్నారు. మన దేశంలో లభించే వివిధ రకాల పండ్లకు ఉండే సహజ గుణాలకు భిన్నంగా రూపొందిస్తున్న ఈ మొక్కలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగని వీటి తయారీ ప్రకృతి విరుద్ధంగానో లేక జీన్‌ మోడిఫైడ్‌గానో చేయడం లేదు. ప్రకృతి సహజంగా లభించే పండ్ల మొక్కల్లో భిన్నమైన లక్షణాలను ముందుగా గుర్తిస్తున్నారు. ఇవన్నీ కలిపి ఒక మొక్కలో వచ్చేవిధంగా అంటు కట్టి తయారు చేస్తున్నారు. ఇలా దేశ, విదేశాల్లో విభిన్న రకాలైన పండ్ల మొక్కలను ఇక్కడకు తీసుకువచ్చి, సరికొత్తగా అభివృద్ధి చేసి, కొనుగోలుదార్లకు అందుబాటులో ఉంచుతున్నారు. 

నిబంధనల ప్రకారం.. 
సాధారణంగా వేరే ప్రదేశం నుంచి ఏదైనా మొక్కను తేవాలంటే ప్లాంట్‌ క్వారంటైన్‌ నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా పండ్ల మొక్కల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి. విభిన్న రకాల మొక్కలను ఆయా నిబంధనలకు లోబడి ఇక్కడి నర్సరీ రైతులు తీసుకువస్తున్నారు. ముంబై, పుణే, కోల్‌కతా, కేరళ, తమిళనాడు, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో క్వారంటైన్‌ లైసెన్సులు ఉన్న పలువురు నర్సరీ రైతులు ఇతర దేశాల నుంచి ఈ రకమైన పండ్ల మొక్కలకు మన దేశానికి తీసుకువస్తున్నారు. వీటిని కడియం ప్రాంత నర్సరీ రైతుల ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. కంటికి భిన్నంగా కనిపించినప్పటికీ రుచిలో ఏ మాత్రం తేడా లేకపోవడంతో వీటి ప్రత్యేకతగా చెబుతున్నారు. తెల్ల నేరేడు, పింక్‌ జామ, ఎరుపు రంగు తొనలు ఇచ్చే పనస, సీడ్‌ లెస్‌ నిమ్మ, పింక్‌ కలర్‌ సీతాఫలం, ఎరుపు రంగులో ఉండే గులాబీ జామ, వెరిగేటెడ్‌ అరటి, స్వీట్‌ గుమ్మడి, పింక్‌ కొబ్బరి, వివిధ రంగుల్లో చిలగడదుంప, ఉసిరి, డ్రాగన్‌ఫ్రూట్, రామాఫలం, ఎర్రని చింత/సీమచింత తదితర రకాల పండ్ల మొక్కలను స్థానిక నర్సరీ రైతులు అభివృద్ధి చేస్తున్నారు. 

పింక్‌ కలర్‌ గులాబీజామ ,ఆరెంజ్‌ పనస స్వీట్‌ గుమ్మడికొనుగోలుదారులను ఆకట్టుకుంటాయి సాధారణంగా ఉండే పండ్ల కంటే భిన్నంగా కనిపిస్తుండడంతో కొనుగోలుదారులను ఇవి ఆకట్టుకుంటున్నాయి. వీటి అభివృద్ధి శ్రమతో కూడినది. కానీ నాణ్యమైన దిగుబడి ఇస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఔత్సాహిక రైతులు వీటిని నాటి మంచి ఫలసాయం పొందుతున్నారు. ఇవి సహజసిద్ధంగా రూపుదిద్దుకున్నవే. 
– కుప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ, బుర్రిలంక 

సహజమైనవే.. 
కొన్ని రకాల పండ్లు, పువ్వులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగు, రుచి, వాసన కలిగి ఉంటాయి. మన దేశంలో పనస సాధారణంగా తెలుపు, లేత గోధుమ, పసుపు రంగుల్లో ఉంటుంది. థాయ్‌లాండ్‌లో ఎరుపు రంగులో ఉంటుంది. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన భిన్న లక్షణాలుంటాయి. వీటిని సేకరించి తీసుకువచ్చి, స్థానిక నర్సరీ రైతులు అభివృద్ధి చేస్తున్నారు. సంబంధిత రకాన్ని అభివృద్ధి చేయడంగానే దీనిని చెప్పవచ్చు. 
– సుధీర్‌కుమార్, ఉద్యాన అధికారి, కడియం

మరిన్ని వార్తలు