పుష్ప.. ద ఫైర్‌!

12 Jun, 2022 12:13 IST|Sakshi

సాక్షి,కడియం(కాకినాడ): అక్కడి పూలు మదిని దోచుతున్నాయి. సాధారణంగా జూలై చివరి వారం నుంచి డిసెంబరు వరకూ మాత్రమే పువ్వుల రకాలు కనిపిస్తుంటాయి. కడియం నర్సరీల్లో అందుకు భిన్నంగా మండుటెండల్లోనూ పూలు వికసిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వీటిని సమ్మర్‌ సీజనల్స్‌గా నర్సరీ రైతులు వ్యవహరిస్తుంటారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా పూలనిచ్చే పలు రకాల మొక్కలను వీరు అభివృద్ధి చేస్తున్నారు. మన దేశంలోనే వివిధ ప్రాంతాలతో పాటు, ఇతర దేశాల నుంచి కూడా వీటిని దిగుమతి చేసుకుని పెంచుతున్నారు.

మొక్కల పెంపకంలో భిన్నత్వాన్ని ప్రదర్శించే ఈ రైతులు కుండీల్లో ఎవెన్యూ రకాల మొక్కలు పెరిగేలా మార్పులు తీసుకువస్తున్నారు. దీంతో ఈ రకాలు పుష్పశోభితంగా కనువిందు చేస్తున్నాయి. ప్రాథమిక దశలో వీటిని పాలిహౌస్‌లు, షేడ్‌నెట్‌ల కింద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెంచాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఆ తరువాత ఇతర పూల మొక్కల మాదిరిగానే నేలపై నాటుకోవచ్చంటున్నారు.

కుండీల్లో కూడా పెంచుకోవచ్చని చెబుతున్నారు. ఈ మొక్కలకు తగినంత నీటిని అందిస్తే చాలు. సాధారణంగా వేసవిలో నీడనిచ్చే మొక్కలే ఏపుగా ఎదుగుతాయి. కానీ ఈ ఆర్నమెంటల్‌ ప్లాంట్స్‌ పూలతో ఏపుగా పెరుగుతుండటం ప్రత్యేకత. ప్రస్తుతం కడియం ప్రాంత నర్సరీ రైతుల వద్ద ఈ మొక్కలు విస్తృతంగా లభిస్తున్నాయి. కొన్ని రకాలకు వేసవి ప్రత్యేకంగానే ఉంటుందని నర్సరీ రైతు తెలిపారు. వేసవిలో కూడా చెట్టు నిండా పువ్వులతో చూడగానే ఆకట్టుకునే అనేక రకాల మొక్కలు ప్రస్తుతం కడియం ప్రాంత నర్సరీల్లో లభిస్తున్నాయన్నారు.

ప్రధాన రకాలివీ..
ఏంజిల్‌వింగ్‌ బ్రిగ్నోనియా, పింక్‌పెండా, లెగస్టోమియా ఇండికా, జస్రాంతస్‌ లిల్లీ, జొకోబినా, యాంజిలోనియా, అగసాంతస్, అమరాంతస్‌ లిల్లీ, కాక్టస్, రంగూన్‌ క్రీపర్, టకోమా డ్వార్ఫ్, తబీబియా సలిడా డ్వార్ఫ్‌ తదితర రకాలు వేసవిలో సైతం ప్రత్యేకంగా పూస్తాయని రైతులు తెలిపారు.

మరిన్ని వార్తలు