ప్లాస్టిక్‌ కొనం.. అమ్మం.. ప్రోత్సహించం

16 Aug, 2022 04:33 IST|Sakshi
ప్లాస్టిక్‌ సరుకు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే తదితరులు

రూ.7 లక్షల విలువైన ప్లాస్టిక్‌ బ్యాగ్‌లను ప్రభుత్వానికి అప్పగించిన కాకినాడ వ్యాపారులు 

సాక్షిప్రతినిధి, కాకినాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ప్లాస్టిక్‌ నిషేధాన్ని స్వచ్చందంగా అమలు చేసేందుకు కాకినాడ వ్యాపారస్తులు ముందుకు వచ్చారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోన్న సందర్భాన్ని ఇందుకు వేదికగా చేసుకున్నారు. ప్రభుత్వ సంకల్పానికి తాము సైతం అంటూ నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులను కాకినాడ నగరపాలక సంస్థకు స్వచ్చందంగా అప్పగించారు.

తొలి ప్రయత్నంగా 35 మంది వ్యాపారులు తమ వద్ద ఉన్న రూ.7 లక్షలు విలువైన 75 మైక్రానులకన్నా తక్కువ మందం కలిగిన క్యారీబ్యాగ్‌లు, థర్మా కోల్‌ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, స్పూన్లు తదితర ప్లాస్టిక్‌ వస్తువులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కమిషనర్‌ రమేష్‌కు అప్పగించారు. నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులను ‘కొనేది లేదు–అమ్మేది లేదు–ప్రోత్సహించేది లేదు’ అంటూ వ్యాపారులు బహిరంగంగా ప్రతిజ్ఞ చేసి వ్యక్తిగతంగా రూ.10 స్టాంప్‌ పేపర్స్‌పై హామీ పత్రాలు రాసి కార్పొరేషన్‌కు అందజేశారు. 

మరిన్ని వార్తలు