Kalamata Venkataramana: మాజీ ఎమ్మెల్యే కలమట వీరంగం

17 Apr, 2022 12:50 IST|Sakshi
 అధికారులతో వాగ్వాదానికి దిగిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ   

అధికారులపై నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు.. స్థాయిని మరిచి మాటలు.. 

మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ దురుసు ప్రవర్తన 

పాతపట్నంలో ఫ్లెక్సీల విషయంలో బెదిరింపులు

పరాజయాలతో కాలు నిలవని అసహనం.. ప్రజాక్షేత్రంలో ఎదురవుతున్న పరాభావాలను తట్టుకోలేని మనస్తత్వం.. ఏం చేయాలో పాలుపోని భయం. ఇవన్నీ టీడీపీ నాయకుల్లో రోజురోజుకీ అసహనాన్ని రేకెత్తిస్తున్నాయి. అందుకే వారేం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియకుండా పోతోంది. తాజాగా శనివారం రాత్రి పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.  

సాక్షి, శ్రీకాకుళం: పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వీరంగా సృష్టించారు. ఎప్పుడో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు వెళ్లిన అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. నోటికి వచ్చినట్లు పరుష పదజాలంతో మాట్లాడుతూ బెదిరింపులకు దిగారు. తన మద్దతుదారులతో గుంపుగా వెళ్లి, అధికారులపై దాడి చేసేలాగా ప్రయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే... గత నెలలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాతపట్నంలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం పూర్తయి, కొన్ని వారాలు గడుస్తున్నా నేటికీ వాటిని తీయలేదు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఎక్కడ ప్రజలకు ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా మారుతాయనే ముందస్తు జాగ్రత్తలతో ఫ్లెక్సీలు తొలగించేందుకు ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పంచాయతీ ఈఓ శనివారం రాత్రి ఉపక్రమించారు.

విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కలమట, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక సందర్భంలో వారి విధులకు ఆటంకం కలిగిస్తూ పైకి దూసుకు వచ్చేలా వ్యవహరించారు. అధికారులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ వినకుండా మాజీ ఎమ్మెల్యే పదే పదే అనుచితంగా వ్యవహరించారు. ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తావో చూస్తామంటూ, మిమ్మల్ని వదలేది లేదంటూ.. మరికొన్ని దురుసు మాటలతో బెదిరింపులకు దిగారు. అక్కడికి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికారులను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అసభ్య పదజాలంతో దూషించారు. ఆ సమయంలో అక్కడ లేని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.  

మరిన్ని వార్తలు