వరాల దేవత.. ఎల్లమ్మ తల్లి

15 Jul, 2022 23:45 IST|Sakshi
జాతరకు ముస్తాబైన ఎల్లమ్మ ఆలయం 

ప్రారంభమైన జాతర హడావిడి 

రేపటి నుంచి ఎల్లమ్మ తిరుణాల ప్రారంభం 

నాలుగు రోజుల పాటు భక్తులతో కిటకిటలాడనున్న కలికిరి

కలికిరి: కలికిరి పట్టణంలో వెలసిన కలికిరి గ్రామ దేవత, భక్తులు కోర్కెలు తీర్చే చల్లని తల్లి ఎల్లమ్మ తిరుణాల శనివారం నుంచి ప్రారంభమవుతుందని ఆలయ ధర్మకర్త రెడ్డివారి అశోక్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించే జాతరలో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారని వివరించారు. జాతరలో భాగంగా ఆలయ ఆవరణంలో శనివారం రాత్రి అమ్మవారి హరికథా కాలక్షేపం, జాగరణ జరుగుతుందన్నారు.

ఆదివారం ఉదయం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తేరులో ప్రత్యేక అలంకరణ మధ్య కలికిరి పట్టణంలో ఊరేగింపు, తదుపరి సిద్దపూజ, అనంతరం మధ్యాహ్నం నుంచి భక్తులు అమ్మవారికి దీలు, బోణాలు సమర్పణ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే రాత్రికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రంగు రంగుల విద్తుత్‌దీపాలంకరణలతో ఏర్పాటు చేసిన చాందినీ బండ్లు ఊరేగింపు, ప్రదర్శన చేపడతారన్నారు.

సోమవారం నుంచి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం, రాత్రి లంకాదహనం, తేరులో పుష్పపల్లకి సేవ నిర్వహిస్తామన్నారు. మంగళవారం జరుగు పార్వేట ఉత్సవంతో జాతర ముగుస్తుందని చెప్పారు.

జాతరకు 27 ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు..
కలికిరి ఎల్లమ్మ జాతరను పురస్కరించుకుని పీలేరు ఆర్టీసీ డిపో నుంచి 27 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు పీలేరు డీఎం కె.కుమార్‌ తెలిపారు. 17న ఆదివారం, 18న సోమవారం రెండు రోజుల పాటు పీలేరు–కలికిరి 5 సర్వీసులు, కలికిరి–కలకడ మార్గంలో 6 సర్వీసులు, సోమల–కలికిరి 6, మదనపల్లి–కలికిరి 5 సర్వీసులు, కలికిరి–సదుం మార్గంలో 3, కలికిరి–వాయల్పాడు 2, మొత్తం 27 సర్వీసులను భ క్తుల సౌకర్యార్థం నడపనున్నామని, ఈ సదుపాయా న్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.

రెండు శతాబ్దాల నాటి ఆలయ చరిత్ర..
సుమారు రెండు శతాబ్దాల క్రితం కలికిరి పంచాయతీ చెరువుముందరపల్లికి చెందిన వర్తకులు వ్యాపార నిమిత్తం కర్నాటక రాష్ట్రం బెంగళూరుకు వెళ్లేవారని, అక్కడ కొనుగోలు చేసిన సరుకులను ఎడ్లబండి ద్వారా కలికిరి ప్రాంతానికి తీసుకువస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలో వ్యాపారులు సరుకులు తరలిస్తున్న ఎడ్లబండి ఇప్పుడు ఆలయం ప్రాంతంలోకి వచ్చి కదలకుండా నిలిచి పోయేది.

వ్యాపారులు ఎన్ని ప్రయాత్నాలు చేసినా ఆ బండి ముందుకు సాగక పోవడంతో బండిలో ఉన్న బస్తాలను కిందకు దించుతుండగా వక్కల బస్తాలో అమ్మవారి విగ్రహం వెలుగులోకి వచ్చింది. దీంతో అమ్మవారిని అదే ప్రాంతంలో విగ్రహ ప్రతిష్ట చేయించి ఆలయం నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు కలికిరి గ్రామ దేవతగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు.

ఆలయం ఏర్పాటైన నాటినుంచి కలికిరి రెడ్డివారిపల్లికి చెందిన రెడ్డివారి కుటుంబీకులు ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ అంచెలంచెలుగా ఆలయాన్ని అభివృద్ధి చేపట్టారు. అలాగే ఉమ్మడిశెట్టి కుటుంబీకులు ఆలయ అర్చకులుగా వ్యవహరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఆషాడమాసంలో అమ్మవారికి పెద్ద ఎత్తున తిరుణాల నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు