ఈ పిట్ట రుచికి నాటుకోళ్లు, పొట్టేలు కూడా సాటిరావు

28 Dec, 2022 12:11 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం(తగరపువలస): సైజులో పిడికిడంత అయినా రుచిలో కముజు(కౌజు) పిట్టకు నాటుకోళ్లు, పొట్టేలు కూడా సాటిరావు అంటారు మాంసప్రియులు. నెలరోజుల వ్యవధిలోనే కోతకు వచ్చే కముజు పిట్టల పెంపకానికి పెట్టుబడి, ఖర్చూ తక్కువే. రెండింతలు ఆదాయాన్ని ఇచ్చే కముజుల పెంపకాన్ని భీమిలి మండలం పరిధిలో ఔత్సాహికులు చేపడుతున్నారు. జపాన్‌ బ్రీడ్‌ పక్షిగా పేరుపొందిన కముజుకు బ్రాయిలర్‌ కోళ్లకు ఇచ్చే ఫీడ్‌తో పెంచవచ్చు.

కొవ్వు తక్కువ, మినరల్స్, విటమిన్లు ఎక్కువగా లభించే ఈ పిట్టలో ఐరన్‌ తక్కువగా ఉంటుంది. అందువల్ల మాంసానికి రుచి వస్తుంది. వీటి మాంసం మధుమేహం, రక్తపోటు అదుపులో ఉంచడానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీని గుడ్డు కూడా నాటుకోడి గుడ్డు కంటే ఎన్నో రెట్లు మేలు చేస్తుందంటారు. కముజు గుడ్డు ధర రూ.2. సాధారణ, నాటుకోడి గుడ్లతో పోలిస్తే వీటి సైజు అయిదు రెట్లు తక్కువగా ఉంటాయి. 

పిల్ల రూ.13.. పక్షి రూ.55  
ఆంధ్ర– ఒడిశా సరిహద్దులోని ఇచ్ఛాపురం ప్రాంతం నుంచి కముజు పక్షులను పెంపకందారులు తెస్తుంటారు. పిల్లగా ఉన్నప్పుడు రూ.13 వంతున కొనుగోలు చేసి తెచ్చి వీటి పెంపకాన్ని చేపడతారు. రాగులు, సజ్జలు కాకుండా బ్రాయిలర్‌ ఫీడ్‌ లేదా లేయర్‌ ఫీడ్‌ స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన తాగునీరు అందిస్తే 30 రోజుల్లోనే 200–250 గ్రాములు వచ్చి కోతకు వస్తుంది. నెల రోజుల వ్యవధిలో వీటి పెంపకానికి అయ్యే ఖర్చు రూ.20 వ్యర్థాలు పోగా ఆహారంలోకి 180–200 గ్రాములు అందుతుంది. వీటిని డిమాండ్‌ను బట్టి రూ.50 నుంచి 60కు విక్రయిస్తుంటారు. హోటళ్లలో జత పక్షులను రూ.250 వరకు విక్రయిస్తుంటారు.

చికెన్‌ వెరైటీల మాదిరిగానే కముజును కూడా మసాలు లేకుండా.. మసాలాలు చేర్చుకుని కర్రీ, ఫ్రై, తండూరి, పకోడి తదితర వంటకాలు చేసుకోవచ్చు. పిల్లల కోసం అయితే ఎనిమిది వారాల్లోనే గుడ్లు పెట్టి 15–18 రోజుల్లోనే పిల్లలను పొదుగుతాయి. ఇంక్యుబేటర్ల ద్వారా కూడా గుడ్లను పొదిగించవచ్చు. పిల్లలు బయటకు వచ్చిన తర్వాత చలికాలంలో బ్రూడర్‌ వద్ద 10 నుంచి 12 రోజులు, వేసవిలో 2 నుంచి ఆరు రోజులు ఉంచాలి. దీని వలన పక్షి ముడుచుకుపోకుండా ఎదగడానికి దోహదపడుతుంది. వీటిని మాంసం లేదా సంతతి వృద్ధి చేసినా రెట్టింపు నుంచి 10 రెట్ల లాభాలు ఆర్జించవచ్చు. కముజుల జీవితకాలం రెండేళ్లు. నాణ్యమైన మాంసం, గుడ్ల కోసం ఒక మగ పక్షికి మూడు ఆడ పక్షులు జతగా వేయాలి. 

వ్యాధులు తక్కువ.. మార్కెటింగ్‌ ఎక్కువ  
కముజులకు నేలమీద తేమ కారణంగా బోరకాలు వ్యాధి సోకుతుంది. వీటిని వేరుచేస్తే ఎలాంటి మందులు వాడకుండానే తగ్గుముఖం పడుతుంది. ఇంకా వీటికి ఎలాంటి వ్యాధులు సోకవు. ప్రస్తుతం ఫంక్షన్లు, హోటళ్లు, డాబాల్లో ఉండే మెనూలలో కముజుకు ప్రాధాన్యం పెరిగింది. హోటళ్లలో ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన పక్షుల వలన రుచి తగ్గవచ్చు కాని ఫారాల దగ్గర ఆర్డర్లు ఇచ్చి కొనుక్కుంటే పెంపకందారులకు ఆదాయం పెరగడంతో పాటు మాంసప్రియుల జిహ్వ చాపల్యాన్ని సంతృప్తి పరచవచ్చు.

కొందరు పెంపకందారులు కోళ్లకు ఇచ్చినట్టే హార్మోన్‌ ఇంజక్షన్లు వీటికి కూడా ఇచ్చి త్వరగా దిగుబడి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాటి రుచి కాస్త తగ్గవచ్చు. వ్యాధులు, జ్వరాలు వంటి పత్యాలు లేకుండా అందరూ అన్ని వేళల్లో తినగలిగే పక్షి ఇది. 

అన్ని వర్గాల ప్రజలకు ఇష్టమైనది  
కముజు గతంలో అంత తేలికగా దొరికేది కాదు. ఇది అన్ని వర్గాల ప్రజలకు ఇష్టమైన మాంసాహారం. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్నాయి. వీటిపై ఎలాంటి నిషేధం లేదు. బ్యాచ్‌ల వారీగా తరచూ ఆర్డర్లు వస్తే విక్రయదారులకు చేతినిండా ఆదాయమే. రెండేళ్ల వరకు వీటిపై లాభాలు పొందవచ్చు. మార్కెటింగ్‌ నైపుణ్యాలు అత్యంత అవసరం.  
– కోన గణేష్, తాళ్లవలస, భీమిలి మండలం

మరిన్ని వార్తలు