అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం

20 Oct, 2020 10:35 IST|Sakshi

సాక్షి, ఇంద్రకీలాద్రి: దసరా నవరాత్రులలో నాలుగవ రోజైన చవితి నాడు బెజవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తుంది, సృష్టిలోని ప్రతీజీవికి కావలసిన చైతన్యం కలిగించే మహాశక్తి అన్నపూర్ణ. ఒక చేతిలో అక్షయ పాత్రతో, మరియొక చేతిలో గరిటెతో దర్శనమిస్తుంది. సాక్షాత్తూ పరమేశ్వరునికే భిక్షనొసంగిన అన్నపూర్ణ అక్షయ శుభాలను కలిగిస్తుంది. ఈ రోజు అన్నపూర్ణాష్టక పారాయణ శుభదాయకం.  

అన్నపూర్ణాష్టకమ్‌
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ!!

అన్నంపరబ్రహ్మ స్వరూపం. అదే సర్వజీవులకు జీవనాధారం. అటువంటి అన్నాన్ని ప్రసాదించేది సాక్షాత్తూ అన్నపూర్ణమ్మ తల్లే. అమ్మవారి దివ్య రూపాల్లో అన్నపూర్ణాదేవి అలంకారం ఒకటి.  అన్నపూర్ణాదేవి అలంకారంలో పరమార్ధం.. సాక్షాత్‌ తన భర్త పరమేశ్వరుడే ఆది భిక్షువుగా యాచనికి వస్తే ఆ తల్లి అన్నపూర్ణాదేవిగా మారి ఆయనకు భిక్షని ప్రసాదిస్తుంది. అలాగే దుర్గమ్మ అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారి వారి ఆకలిని తీరుస్తుంది. అటువంటి అన్నపూర్ణమ్మ రూపంలో ఇవాళ     ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులకు కనువిందు  చేయనున్నారు. 

ఈ విధంగా సాగే అన్నపూర్ణాష్టకం చదివితే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. శ్రీశైలంలోని భ్రమరాంబ కూష్మాండ రూపంలో దర్శనమిస్తుంది. తేజోమయ రూపంతో ఎనిమిది భుజాలతో కనిపించే రూపం కూష్మాండ.  అలంకారం, నివేదన: ఈ రోజు పులిహోర, పెసరపప్పు పాయసం నివేదన చేయాలి. ఎరుపురంగు వస్త్రాలను ధరింపచేసి కూరగాయలతో చేసిన కదంబం నివేదన చేయాలి. శ్రీసూక్త పారాయణ శ్రేష్టం.కూష్మాండ శ్లోకంసురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవచ ! దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే !!

ఈ చిత్రంలో దుర్గాదేవి వేషధారణలో ఆధ్యాత్మిక ప్రకాశంతో కనిపిస్తున్నది అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో సిన్‌సినాటి నగరంలో ఉంటున్న శ్రీమతి మద్దూరి సుహాసిని మధుర లాలస! ప్రసిద్ధ నాట్యాచారిణి ‘పద్మశ్రీ’ శోభానాయుడు చేత గజ్జె కట్టించుకుని, ఆమె శిష్యురాలిగా కూచిపూడి నాట్య వైభవాన్ని ప్రచారం చేసే మార్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం తన ప్రదర్శనలో భాగంగా శోభానాయుడు తన శిష్యురాలైన మధుర లాలసకు దుర్గాదేవి వేషాన్ని ధరింపజేసి, ముమ్మూర్తులా అమ్మవారిలా ఉన్నావంటూ నమస్కరిస్తూ ఆశీర్వదించారు. తన గురువైన శోభానాయుడు కూచిపూడి నాట్యకళకు చేసిన సేవ అనితరసాధ్యమనీ, ఆమె తనను అమితంగా ప్రేమించేవారనీ మధుర లాలస కన్నీళ్లతో గుర్తుచేసుకున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు