నేటితో తీరనున్న విజయవాడ వాసుల కష్టాలు

16 Oct, 2020 08:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇక నగర ప్రజల ట్రాఫిక్‌ కష్టాలను తీరుస్తూ బెజవాడకు తలమానికంగా నిలిచే బెంజ్‌ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్లు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వర్చువల్‌ ద్వారా  ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వాటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా రూ.15,591.9 కోట్ల అంచనాలతో రూపొందించిన 61 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పది ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు.

భవానీపురం నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్‌ మీదుగా వాహనాల రాకపోకలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ లాంఛనంగా  ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కనకదుర్గ ఫ్లైఓవర్‌  ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌లతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ అత్యంత సాంకేతిక విలువలతో రూ.501 కోట్లతో నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ విజయవాడ నగరానికి మకుటంలా నిలుస్తుందన్నారు. 

రాష్ట్రంలో రూ.7,584.68 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన, రూ.8,007.22 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఏపీలో 878.4 కి.మీ. మేర కొత్తగా జాతీయ రహదారుల్ని రూ.7,584.68 కోట్లతో నిర్మించనున్నారు. రూ.8,007.22 కోట్లతో పూర్తయిన 532.696 కి.మీ. మేర రహదారుల నిర్మాణం, ఆర్వోబీలను జాతికి అంకితం చేయనున్నారు. అంటే మొత్తంగా ఈ ప్రాజెక్టుల విలువ రూ.15,591.9 కోట్లు. కాగా, మొత్తం రహదారులు 1,411.096 కిలోమీటర్లు. 

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, దుర్గ గుడి ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంతో విజయవాడ ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీరబోతున్నాయని బీజేపీ అధ్యక్షుడు పేర్కొన్నారు. 2.6 కి.మీ  పొడవుతో  వంపులు తిరుగుతూ ఉన్న దుర్గగుడి ఫ్లైఓవర్‌  దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.

చదవండి: బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది

మరిన్ని వార్తలు