కందుకూరు ఘటన: డ్రోన్‌ షాట్ల దారుణమే! ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం

21 Jan, 2023 10:22 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: డ్రోన్‌ షాట్ల కోసం ఇరుకు కూడలిలో టీడీపీ బహిరంగ సభను నిర్వహించడంతోపాటు భారీగా ఫ్లెక్సీలు, ద్విచక్ర వాహనాల పార్కింగ్‌తో తోపులాట చోటు చేసుకుని తొక్కిసలాట జరిగినట్లు కందుకూరు ఘటనలో ప్రత్యక్ష సాక్షులు, బాధిత కుటుంబాలు విచారణ కమిషన్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చాయి. గత నెల 28వ తేదీన ‘ఇదేం కర్మ’లో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు ఎన్‌టీఆర్‌ సర్కిల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై విచారణకు ఏర్పాటైన హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ శేషశయనారెడ్డి నేతృత్వంలోని కమిషన్‌ శుక్రవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి పలువురి నుంచి వాంగ్మూలం సేకరించింది. తొక్కిసలాట ఎలా జరిగింది? ఆ సమయంలో ఎంత మంది ఉన్నారు? అనే అంశాలపై ఆరా తీసింది.  

వాహనం ఎక్కడ నిలిపారు? 
తొలుత ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో అధికారుల నుంచి వివరాలు సేకరించిన అనంతరం కమిషన్‌ ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ను పరిశీలించింది. బహిరంగ సభకు ఎక్కడ అనుమతి ఇచ్చారు? చంద్రబాబు వాహనం ఎక్కడ నిలిపారు? అనే అంశాలతోపాటు ప్రమాదం జరిగిన గుండంకట్ట రోడ్డును క్షుణ్నంగా పరిశీలించింది. ఇరువైపులా ఉన్న రెండు డ్రైనే­జీలను పరిశీలించింది. కందుకూరు టీడీపీ ఇన్‌చార్జి ప్రకటించిన పరిహారం అందలేదని బాధిత కుటుంబాలు కమిషన్‌ దృష్టికి తెచ్చా­యి. దాదాపు 27 మంది నుంచి కమిషన్‌ వాంగ్మూలం నమోదు చేసిం­ది.

మరిన్ని వార్తలు