వైభవం..వరసిద్ధుని మహాకుంభాభిషేకం 

22 Aug, 2022 05:18 IST|Sakshi
కాణిపాక ఆలయంలో శిలాఫలకం ప్రారంభించిన శక్తినారాయణి అమ్మవారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు

ఐదు నెలల తర్వాత స్వయంభు దర్శనం 

తొలిరోజే పోటెత్తిన భక్తులు..

మధ్యాహ్నం నుంచి సర్వదర్శనం అమలు 

శిలాఫలకం ఆవిష్కరించిన శ్రీపురం స్వర్ణదేవాలయం వ్యవస్థాపకులు, శక్తినారాయణి అమ్మవారు

సాక్షి చిత్తూరు: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా సాగింది. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని విరాళదాతలు ఇచ్చిన రూ.10 కోట్లతో శిల్పకళా సౌందర్యంతో పునర్నిర్మించారు. ఇందులో భాగంగా ఆదివారం మహా కుంభాభిషేకం క్రతువును ఆగమ పండితులు వేదోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు చతుర్థకాల పూజ, హోమం, మహా పూర్ణాహుతి, కలశోద్వాసన నిర్వహించారు. 8 గంటలకు రాజగోపురం, పశ్చిమ ద్వార గోపురం, విమాన గోపురం, నూతన ధ్వజస్తంభానికి, 8.30 గంటలకు స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారికి మహా కుంభాభిషేకం నిర్వహించారు.

అనంతరం భక్తులను స్వయంభు దర్శనానికి అనుమతించారు. సుమారు 5 నెలల తరువాత స్వయంభు దర్శనం తిరిగి ప్రారంభించడంతో భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని పుష్పాలు,  విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. తొలిరోజే సుమారు 20–30 వేల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కుంభాభిషేకం క్రతువు సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వేలూరు శ్రీపురం స్వర్ణదేవాలయం వ్యవస్థాపకులు శక్తినారాయణి అమ్మవారు ఆవిష్కరించారు.

ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపీ మిథున్‌ రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు ఎంఎస్‌బాబు, ఆరణి శ్రీనివాసులు, ఆలయ చైర్మన్‌ మోహన్‌ రెడ్డి, ఈవో సురేష్‌బాబు, విరాళ దాత కుటుంబ సభ్యులు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు