Kanipakam: జనవరి 1న కాణిపాకంలో ప్రత్యేక ఏర్పాట్లు 

27 Dec, 2022 16:06 IST|Sakshi

వేకువజామున 2 నుంచి శ్రీ వరసిద్ధి వినాయకుడి దర్శనం

సామాన్యులకు మొదటి ప్రాధాన్యం 

యాదమరి(చిత్తూరు జిల్లా):  జనవరి 1, 2 తేదీల్లో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు తెలిపారు. స్వామివారి సమావేశపు మందిరంలో చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు అధ్యక్షతన ఆర్డీవో రేణుక, వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. 

జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరం, జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనార్థం భక్తులు లక్ష మందికి పైగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. వీఐపీలు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 

ఈ  సందర్భంగా ఆ వివరాలను ఎమ్మెల్యే బాబు మీడియాకు వెల్లడించారు. వేకువజామున 2 గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పించనున్నామన్నారు. 12 గంటల తర్వాత స్వామికి అభిషేకాలు, అలంకరణ, చందన అలంకరణ, ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ రెండు రోజుల పాటు స్వామివారి అంతరాలయ దర్శనం, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. 

తిరుపతి, చిత్తూరు పీలేరు, మదనపల్లె, పలమనేరు, కుప్పం డిపోల నుంచి ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్య అన్నదానం ఉంటుందని వివరించారు. (క్లిక్‌ చేయండి: టోకెన్‌ ఉంటేనే వైకుంఠ ద్వార దర్శనం)

మరిన్ని వార్తలు