Kannababu: ‘తూర్పు’లో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు

26 Sep, 2021 09:33 IST|Sakshi
కురసాల కన్నబాబు (ఫైల్‌ ఫోటో)

ఎగుమతులు, పెట్టుబడులకు ప్రోత్సాహం

ఎక్స్‌పోర్టర్స్‌ కాన్‌క్లేవ్‌లో మంత్రి కన్నబాబు

కాకినాడ రూరల్‌: తూర్పుగోదావరి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్ని సదుపాయాలూ ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వాణిజ్య ఉత్సవంలో భాగంగా కాకినాడలో ఎగుమతిదారుల సమ్మేళనం (ఎక్స్‌పోర్టర్స్‌ కాన్‌క్లేవ్‌) శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ సమ్మేళనాన్ని రాష్ట్ర మంత్రులు కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు.

ఈ సమ్మేళనంలో 28 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో వాణిజ్య అభివృద్ధితో పాటు పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో పాటు పెద్ద పరిశ్రమలు నెలకొల్పేందుకు చక్కని అవకాశాలున్నాయని వివరించారు. ఇప్పటికే రెండు పోర్టులు అందుబాటులో ఉండగా మరొకటి రాబోతోందని తెలిపారు.

ఎగుమతులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ముందుంటుందని, పెట్టుబడిదారులు ఉత్సాహంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్ర, ఎమ్మెల్యేలు చంద్రశేఖరరెడ్డి, జక్కంపూడి రాజా, పొన్నాడ సతీష్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు