బాలకృష్ణకు కాపునాడు అల్టిమేటం.. బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే!

24 Jan, 2023 17:55 IST|Sakshi

సాక్షి, విజయవాడ: టాలీవుడ్‌ సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ దిగ్గజాలను ఉద్దేశించి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై కాపునాడు తాజాగా ఆయనకు అల్టిమేటం జారీ చేసింది. బాలకృష్ణ వ్యాఖ్యలు కాపుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని, ఈ నెల 25వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని బాలయ్యను డిమాండ్‌ చేశాయి. 

ఒకవేళ బాలకృష్ణ గనుక క్షమాపణలు చెప్పని తరుణంలో..  రంగా విగ్రహాల వద్ద మౌన ప్రదర్శన పాటించి నిరసన తెలపాలని కాపు సోదరులకు కాపునాడు పిలుపు ఇచ్చింది. నిర్ణీత సమయంలోపు బాలకృష్ణ కాపు సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాలి. గతంలో దేవీబ్రహ్మణులపై వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న బాలయ్య.. సంతకం లేని లేఖ రిలీజ్‌ చేసి క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు అలాకాకుండా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ కాపు సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాలని కాపునాడు డిమాండ్‌ చేస్తోంది. 

అలా జరగని పక్షంలో.. టీడీపీ నుంచి బాలకృష్ణను పదేళ్ల పాటు బహిష్కరించాలి. ఇవేవీ జరగకుంటే నారా లోకేష్‌ చేపట్టబోయే యువ గళం పాదయాత్రను అడ్డుకుంటామని కాపునాడు హెచ్చరికలు జారీ చేసింది.  

తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావును ఉద్దేశిస్తూ నందమూరి బాలకృష్ణ ‘‘ఆ రంగా రావు.. ఈ రంగా రావు’’ అని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కాపునాడు తీవ్రంగా పరిగణించింది. గతంలో కూడా.. కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ బాలయ్య తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

రాజకీయాలలో చిరంజీవి విఫలమయ్యారని వ్యాఖ్యానించిన క్రమంలో.. రాజకీయాలలో విజయం తమకే సాధ్యమని.. ‘‘మా బ్లడ్డు వేరు మా బ్రీడు వేరు’’ అంటూ చేసిన కామెంట్లు కూడా కాపుల మనోభావాలని తీవ్రంగా దెబ్బతీశాయి. అటుపై జనసేన పార్టీ లో తిరిగే వారందరూ అలగాజనం అనీ సంకరజాతి జనం అని అంటూ చేసిన వ్యాఖ్యలైతే ఏకంగా గుండెల్లో గునపాలు దింపాయని కాపు సామాజిక వర్గం పేర్కొంది.

మరిన్ని వార్తలు