బలంగా ‘బాదినా’ బుద్ధి రాలేదా? 

15 Aug, 2022 13:05 IST|Sakshi

రాయదుర్గం: ‘ప్రజల సంక్షేమాన్ని విస్మరించినందుకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు పరిమితం చేసినా మీకు బుద్ధి రాలేదా..? ‘బాదుడే.. బాదుడు’ కార్యక్రమం పేరుతో వీధినాటకాలకు తెర తీస్తారా? పేదలపై వివక్ష, విద్వేషాలను రెచ్చగొట్టే ‘పచ్చ’ కుట్రలకు స్వస్తి పలకకపోతే 2024 ఎన్నికల్లో మూడు సీట్లు కూడా దక్కవు’ అంటూ మాజీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుపై రాష్ట్ర ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం రాయదుర్గంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ ‘పచ్చ బ్యాచ్‌’ ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం చేస్తుండడంపై మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క మంచి పనైనా చేశావా అంటూ కాలవను ప్రశ్నించారు.

ఉన్నత చదువులు చదువుకున్నానని చెప్పుకునే నీకు ధరల పట్ల కనీస జ్ఞానం లేకపోవడం విచారకరమన్నారు. ‘పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలోని మొలకాల్మూరు, చిత్రదుర్గం, బళ్లారికి నాతో కలిసి నీవు, నీ పచ్చ బ్యాచ్, మీడియాతో వస్తే అక్కడ మీరు చెప్పిన దుకాణాల్లో నిత్యావసర ధరలు విచారిద్దాం.. ఆ తర్వాత రాయదుర్గం, అనంతపురం వచ్చి ఇక్కడెలా ఉన్నాయో బేరీజు వేద్దాం. ధరల్లో వ్యత్యాసం కనిపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా?’   అంటూ సవాల్‌ విసిరారు. రాజకీయ స్వార్థం కోసం ప్రజలను మోసం చేయాలని చూడొద్దని హితవు పలికారు. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వ అభిమతమని, పేదలందరికీ కడుపునిండా అన్నం పెట్టాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమని గుర్తుచేశారు. అసత్య ఆరోపణలు మానుకోకపోతే ‘చీపుర్లతో బాదుడు’ తప్పదని హెచ్చరించారు. 

సోషల్‌ మీడియా తోకలు కత్తిరిస్తాం.. 
‘సొంత డబ్బుతో నిస్వార్థంగా సామాజిక సేవ చేస్తున్న నాపై విమర్శలు చేసినా సహించా. దీన్ని అలుసుగా తీసుకుని నా కుటుంబంపై అక్కసు వెళ్లగక్కుతూ అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టించేలా   కుట్రలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదు. ఖబడ్దార్‌’ అంటూ కాలవకు విప్‌ కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ‘రెడ్‌క్రాస్‌ సంస్థకే వన్నె తెచ్చేలా జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి.. ఆపద సమయంలో ప్రజలకు రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడే బాధ్యత సంస్థ చైర్‌పర్సన్‌గా కాపు భారతి తీసుకుంటే ప్రశంసించాల్సిందిపోయి.. సోషల్‌ మీడియాలో వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెట్టిస్తావా..? ఇదా రాజకీయంలో నీవు నేర్చుకున్న నీతి’   అంటూ విరుచుకుపడ్డారు.

అసభ్యకర పోస్టింగ్‌లపై ఇప్పటికే ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానన్నారు. అయినా పద్ధతి మార్చుకోకపోతే అభిమానులు, కార్యకర్తలు, ప్రజల ద్వారా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. కాలవ శ్రీనివాసులు చీకటి బతుకు గురించి తెలిస్తే ప్రజలే ముఖాన ఉమ్మేస్తారని, పరిస్థితి అంతదాకా తెచ్చుకోవద్దని అన్నారు. నీతిమాలిన రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచావని దుమ్మెత్తి పోశారు. కరోనా లాంటి కష్టకాలంలో రోడ్డు మీదకొచ్చి తాము ప్రజలకు సేవ చేస్తే ప్రతిపక్ష పార్టీ నేతలు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. కులాలు, మతాల మధ్య కుంపట్లు పెట్టి ప్రశాంతంగా ఉండే రాయదుర్గాన్ని రావణకాష్టగా మార్చాలని చూస్తే సహించేది లేదన్నారు. 

మార్ఫింగ్‌ వీడియో పోస్టు చేయించి డ్రామాలా? 
బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంలో టీడీపీ ఆడిన డ్రామాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయని విప్‌ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ‘ఐ– టీడీపీ’ అనే ఓ వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా అర్ధరాత్రి మారి్ఫంగ్‌ వీడియో పోస్ట్‌ చేసి నీచమైన కుట్రకు ఒడిగట్టి.. ఏదో జరిగిపోయిదంటూ డ్రామాలు ఆడతారా  అంటూ నిలదీశారు. వీడియో ఒరిజినల్‌ కాదని ఎస్పీ చెబుతున్నా.. దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు.

2024 ఎన్నికలే టీడీపీకి ఆఖరివి కానున్నాయన్నారు. ఇందుకు చాలామంది టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరడమే నిదర్శనమన్నారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు శ్రీనివాస్‌యాదవ్, వలిబాషా, వైఎస్సార్‌సీపీ పట్టణ కనీ్వనర్‌ ముస్తాక్, గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు పీఎస్‌ మహే‹Ù, మండల కనీ్వనర్‌ బోయ మంజునాథ, సీనియర్‌ నాయకుడు గొల్లపల్లి కాంతారెడ్డి, కౌన్సిలర్లు తదితరులు   పాల్గొన్నారు.   

(చదవండి: వారంతా చంద్రబాబుతో చేతులు కలిపారు: ఎంపీ గోరంట్ల మాధవ్‌)

మరిన్ని వార్తలు