రూ.వెయ్యి కోట్లు ఏ ఖాతాలో ఉన్నాయి? 

19 Mar, 2022 09:27 IST|Sakshi

కణేకల్లు(అనంతపురం): భైరవానితిప్ప ప్రాజెక్ట్‌ (బీటీపీ)కు హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చేందుకు టీడీపీ హయాంలో మంజూరైన రూ.వెయ్యి కోట్లు ఏ ఖాతాలో ఉన్నాయో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రజలకు తెలపాలని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన రాయదుర్గం మార్కెట్‌యార్డు చైర్‌పర్సన్‌ ఉషారాణి, జెడ్పీటీసీ సభ్యులు డి.పద్మావతి, ఎంపీపీ సంధ్య, వైస్‌ ఎంపీపీ లీలావతి, వైఎస్సార్‌ సీపీ మండల  కన్వీనర్‌ చిక్కణ్ణ, మాజీ ఎంపీపీ రాజగోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పాటిల్‌ నాగిరెడ్డితో కలిసి కణేకల్లులోని హెచ్చెల్సీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. బీటీపీ కోసం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసినట్లు కాలవ తెచ్చిన జీఓ అంతా ఉత్తిదేనన్నారు. జగన్‌తోనే బీటీపీకి కృష్ణా జలాలు సాధ్యమన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాయదుర్గానికి వచ్చిన సమయంలో బీటీపీకి కృష్ణా జలాలు తీసుకొస్తామని మాట ఇచ్చారని, త్వరలోనే పనులు ప్రారంభించి కృష్ణా జలాలు తెచ్చితీరుతామన్నారు.  

కాలవా.. ఇవి నిజం కాదా..? 
బీటీపీపై మట్టి రోడ్డు వేసి రూ.50 లక్షలు, పైలాన్‌ కట్టి రూ.80 లక్షలు మీరు దోచేయడం నిజం కాదా..?  
నాగేపల్లి గ్రామంలో మారుతి వనం పేరుతో అనుచరులతో కలిసి రూ.కోట్లు పందికొక్కుల్లా మెక్కడం వాస్తవం కాదా..? 
కులానికో కల్యాణ మంటపమంటూ స్థలం కేటాయింపులపై ఉత్తుత్తి కాగితాలిచ్చి కుల రాజకీయాలు చేసింది నువ్వు కాదా...? 
2019లో ఎన్నికల కోడ్‌ వచ్చిన సమయంలో ఓబుళాపురం గ్రామంలో తాగునీటి పథకం పనికి భూమి పూజ చేసి ప్రజలను వంచించిన ఘనత నీది కాదా..? 
రూ.3,500 కోట్లతో రాయదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటున్న కాలవ ఆ నిధులతో ఏయే పనులు చేశారో చెప్పాలని కాపు నిలదీశారు. 
 
మీ జాతకాలు బయటపెడతా 
అసెంబ్లీ సమావేశాల తర్వాత రాయదుర్గం నియోజకవర్గంలో ‘నీరు–చెట్టు’ పథకం పేరుతో కాలవ, అతని అనుచరులు ఎవరెవరు ఎంత దోచేశారో.. వారి జాతకాలను బయట పెడతానని కాపు పేర్కొన్నారు. కణేకల్లు చెరువు పేరుతో రూ.2 కోట్లు, కళేకుర్తి చెరువు పూడికతీత పేరుతో భారీగా నిధులు దోచేశారన్నారు. సమావేశంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు పైనేటి తిమ్మప్పచౌదరి, మాజీ అధ్యక్షుడు మారెంపల్లి మారెన్న, కణేకల్లు పట్టణ వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ టీ.కేశవరెడ్డి, మాజీ సర్పంచు పాటిల్‌ చెన్నకేశవరెడ్డి, కెనిగుంట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు