జగన్‌ పాలనపై 100% సంతృప్తి 

7 Sep, 2020 04:40 IST|Sakshi

ఈ ఏడాది మార్చి వరకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సర్వే జరిగింది 

రానున్న కాలంలో మరిన్ని పారిశ్రామిక సంస్కరణలు 

‘సాక్షి’తో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ 

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలు 100 శాతం సంతృప్తిని వ్యక్తం చేశారని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ తెలిపారు. గత నాలుగేళ్ల నుంచి కేంద్రం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (సులభతర వాణిజ్యం) ర్యాంకులను ప్రకటిస్తోందని చెప్పారు. తొలిసారిగా సంస్కరణల వల్ల లబ్ధి పొందుతున్న స్టేక్‌ హోల్డర్ల నుంచి అభిప్రాయాలను తీసుకొని ర్యాంకులను ప్రకటించారని అన్నారు. ఈ సర్వే ఈ ఏడాది మార్చి వరకు జరిగిందని ‘సాక్షి’కి వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సులభతర వాణిజ్యానికి సంస్కరణల అమలుకు సంబంధించిన వివరాలను 2019, ఆగస్టులో కేంద్రానికి ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలపై స్టేక్‌ హోల్డర్లు సంతృప్తి వ్యక్తం చేయడం వల్లే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచామన్నారు. పారిశ్రామిక రంగంతో నేరుగా సంబంధం ఉన్న పెట్టుబడిదారులు, ఆడిటర్లు, లాయర్లు, ఆర్కిటెక్చర్లు వంటి స్టేక్‌ హోల్డర్ల నుంచి వివరాలు సేకరించినట్లు తెలిపారు. 

10 రోజుల్లోనే పరిశ్రమలకు అవసరమైన భూమి 
► పరిశ్రమల శాఖ మంత్రిగా మేకపాటి గౌతమ్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు కరికాల వలవన్‌ తెలిపారు.  
► పరిశ్రమలకు అవసరమైన భూమిని 10 రోజుల్లోనే కేటాయిస్తుండటమే కాకుండా తొలిసారిగా పరిశ్రమలకు కీలకమైన నీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు.  
► సులభతర వాణిజ్యంతోపాటు పెట్టుబడి వ్యయాలను తగ్గించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు.  
► కోవిడ్‌ వల్ల కష్టాల్లో ఉన్న పరిశ్రమలను రీస్టార్ట్‌ ద్వారా ఆదుకున్నామన్నారు. 
► పరిశ్రమల అవసరాలను తెలుసుకోవడానికి దేశంలోనే తొలిసారిగా సమగ్ర పరిశ్రమ సర్వే నిర్వహిస్తుండటమే కాకుండా పరిశ్రమలన్నింటికీ ఆధార్‌ నంబర్‌ కేటాయిస్తున్నామని వివరించారు.  
► ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మొదటి ర్యాంకు సాధించడం, రాష్ట్రంలో పటిష్టమైన ప్రభుత్వం ఉండటంతో మరిన్ని కొత్త పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు