ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి

23 Jun, 2021 11:44 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రముఖ వెయిట్‌లిఫ్టర్, ఒలింపిక్‌ పతక విజేత కరణం మల్లీశ్వరి ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ తొలి వైస్‌ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ  చాన్స్‌లర్‌ అయిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ఊసవానిపేటకు చెందిన మల్లీశ్వరి 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించారు.

అంచెలంచెలుగా.. 
ఆమదాలవలస మండల పరిధిలోని ఊసవానివానిపేట అనే మారుమూల గ్రామానికి చెందిన మల్లేశ్వరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆమె తల్లిదండ్రులు కరణం మనోహర్, శ్యామల. మల్లేశ్వరి అక్క నరసమ్మకు జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ మాజీ కోచ్‌ నీలంసెట్టి అప్పన్న శిక్షణ ఇస్తుండేవారు. అక్క విజయాలను చూసిన మల్లేశ్వరి కూడా వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకున్నారు. తొలుత జిల్లాస్థాయి, దానికి కొనసాగింపుగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. అనంతరం జాతీయ స్థాయిలో పతకాల పంట పండించారు. 

ఒలింపియన్‌గా.. 
2000లో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్‌లో మల్లేశ్వరి 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి విశ్వవ్యాప్తంగా సిక్కోలు ఖ్యాతిని వ్యాపింపజేశారు. ఈ పోటీ ల్లో 110 కేజీల స్నాచ్, 130 కేజీల క్లీన్‌ అండ్‌ జర్క్‌ ద్వారా మొత్తం 240 కేజీల బరువు ఎత్తి ఒలింపిక్స్‌ లో పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. అంతకుముందు పలు ప్ర పంచస్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీ ల్లో మల్లేశ్వరి వరుసగా పతకాల పంట పండించారు.

మొత్తం అన్నీ 54 కేజీల విభాగంలో సాధించారు. 1993లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో కాంస్యం, 1994లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో బంగారం, 1995లో చైనాలోని గ్యాంగ్‌ఝూలో బంగారం, 1996లో చైనాలోని గ్యాంగ్‌ ఝాలో కాంస్య పతకాలు సాధించింది. ఆ తరువాత 1998లో బ్యాంకాక్‌లో జరిగిన ఏసియన్‌ గేమ్స్‌లో 63 కేజీల విభా గంలో రజతం సాధించి శభాష్‌ అనిపించారు. 1997 లో ఈమె సహచర వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారుడైన రాజేష్‌ త్యాగిని వివాహం చేసుకున్నారు. 2004 ఒలింపిక్స్‌ తర్వాత తన ఆటకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు.

ప్రస్తుతం ఈమె హర్యానాలోని యమునానగర్‌లో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఇండియా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలాగే స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఏపీ (శాప్‌) బోర్డు డైరెక్టర్‌గా, దేశంలోని పలు స్పోర్ట్స్‌ కమిటీల్లో, ఇండియన్‌ వెయిట్‌లిప్టింగ్‌ ఫెడరేషన్‌లో కీలక సభ్యురాలిగా ఉన్నారు. తాజాగా ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి మొదటి వీసీగా నియామకమయ్యారు.
చదవండి:  Milkha Singh Love Story: ఆమె ప్రేమకై అతడి పరుగు

మరిన్ని వార్తలు