ఏడు ఊర్లు కలసి హాల్వి.. దీనికో చరిత్ర ఉంది!

6 Dec, 2021 10:19 IST|Sakshi

సాక్షి, మంత్రాలయం: పూర్వం ఆహారాన్వేషణ క్రమంలో నదీతీరం, కొండ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకుని జీవించిన ప్రజలు కాలక్రమేణా అక్కడి నుంచి వలస పోవడంతో ఊర్లు శిథిలమై కనుమరుగయ్యాయి. ఇలాంటి గ్రామాలు కాలగర్భంలో ఎన్నో కలసిపోయాయి. రికార్డుల్లో పేర్లు ఉన్నా.. కనిపించని ఊర్లు కర్నూలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. కర్ణాటక సరిహద్దులోని హాల్వి గ్రామానికో విశిష్టత ఉంది. ఏడు ఊర్లు ఒక్కటిగా ఏర్పడి ప్రత్యేకతల నిలయంగా విరాజిల్లుతోంది. మంత్రాలయం నియోజకవర్గంలో మండల కేంద్రమైన కౌతాళానికి 14 కి.మీ. దూరంలో హాల్వి గ్రామం ఉంది. కొండ అంచున ఈశాన్య దిశగా గ్రామం ఏర్పడింది.

ప్రస్తుతం గ్రామ జనాభా 5,114 ఉండగా స్త్రీలు 2,613, పురుషులు 2,501 ఉన్నారు. ఓటర్లు 3,314 కాగా స్త్రీలు 1,705, పురుషులు 1,609. గ్రామంలో 5,789 హెక్టార్ల సాగుభూమి ఉంది. ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం. పూర్వం హాల్వి ఏడు గ్రామాలు కలిసి ఏర్పడిందని అక్కడ ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నాయి. కోట, పేట, నంతాపుర, సిద్దాపురం, హాల్వి, కొరవ దుద్ది, నాగలాపురం గ్రామాలు ఏకమై హాల్వి గ్రామంగా ఏర్పడినట్లు తెలుస్తోంది.

గ్రామంలో ఏడేసి బావులు, బొడ్రాయిలు, గ్రామ చావిడిలు, ఆంజనేయస్వామి ఆలయాలు, పీర్ల మసీదులు నిలిచాయి. రామక్కమ్మ, కోనపుర, ఈర, కోటల, రెడ్డి, పక్కీరు, సిద్దేశ్వర పేర్లపై ఏడు బావులు ఉన్నాయి. మూడు తరాల క్రితమే ఈ ఊళ్లు హాల్విలో భాగమై పోయాయని పెద్దలు చెబుతున్నారు. పూర్వం కొండ ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకున్న ఓ ముని భార్య ఆలియా పేరు మీదనే హాల్వి ఏర్పడిందని కథనం ప్రాచుర్యంలో ఉంది.    

‘భావి’తరాలకు సాక్ష్యంగా..  

గ్రామంలో బ్రాహ్మణ కులానికి చెందిన దేశాయ్‌ వంశీకులకు ప్రత్యేకత ఉంది. నేటికీ గ్రామంలో జాతర జరిగితే ఆ ఇంటి అరుగుపై సిద్ధేశ్వరస్వామి పల్లకీ పూజలు నిర్వహించిన తర్వాతనే వేడుకకు అంకురార్పణ పలుకుతారు. దేశాయ్‌ వంశీకులు అప్పట్లో గ్రామంలో దాహం తీర్చేందుకు బావులు తవ్వించినట్లు తెలుస్తోంది. వారి సేవలను గుర్తించి అప్పటి ఆదోని నవాబు సిద్ది మసూద్‌ ఖాన్‌..  దేశాయ్‌ బిరుదు ఇచ్చినట్లు ఆ వంశీకుడు శ్రీపాద దేశాయ్‌ చెబుతున్నారు.

గ్రామంలో కోనపుర, ఈర, కోటల బావులు వారు నిర్మించినవే. బావుల తవ్వకాలు, కట్టడం అద్భుతంగా ఉంటుంది. దేశాయ్‌ ఇంటిని ఆనుకుని ఈశాన్య దిశలో కోటల బావి, ఊరి తూర్పు దిక్కున ఈర బావి.. ఆదోనిలోని వెంకన్న బావి తరహాలో నిర్మించారు. శిల్ప కళ ఉట్టిపడుతుంది. సింహాలు, తోరణాలు, దేవతామూర్తుల ఆకృతులు బావుల చుట్టూ ఆకట్టుకుంటున్నాయి. ఆగ్నేయ దిశలో ఉన్న రామక్కమ్మ బావి చాలా ఏళ్లు గ్రామస్తులు దాహం తీర్చింది.   

చెక్కు చెదరని ‘కోట’.. 

సమీపంలోని కొండ పైభాగంలో పూర్వం కోట నిర్మించారు. కోటలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. బ్రిటీష్‌ కాలంలో కోటలోనే ఊరు ఉండేదని, ఊరు పేరు సైతం కోటగా పిలువ బడేదని తెలుస్తోంది. ఊరి కంతా ఒకటే గ్రామ వాకిలి ఉన్నట్లు ఆనవాళ్లు తెలుస్తున్నాయి. నేటికీ రాతి కోట పదిలంగా ఉంది. కాలానుగుణంగా అక్కడ ఉన్న కోట వాసులు కొండ కిందకు తరలివచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు.

ఐక్యతకు నిలయం 
మా ఊరు ఐక్యతకు నిలయం. ఏడు గ్రామాలు కలిసి హాల్విగా ఏర్పడిందని మా పెద్దలు చెబుతున్నారు. ఇక్కడ అందరూ కలిసిమెలసి ఉంటారు. ఊర్లో బొడ్రాయిలు, గ్రామ చావిడిలు, ఆంజనేయస్వామి ఆలయాలు, బావులు, పీర్ల మసీదులు ఏడేసి ఉన్నాయి. ఇవే నాటి గ్రామాలకు ఆనవాళ్లుగా నిలిచాయి. – లింగన్న, హాల్వి   

ప్రత్యేకతల నెలవు 
గ్రామంలో చూడ చక్కని ప్రదేశాలు చాలా ఉన్నాయి. సిద్ధేశ్వరస్వామి ఆలయంతో పాటు శిల్ప కళ ఉట్టిపడే బావులు ఉన్నాయి. ఈర బావి చూడ ముచ్చటగా ఉంటుంది. ఇప్పట్లో ఇలాంటి బావులు కట్టడం సాధ్యం కాదు. అప్పట్లో ఈర బావి చుట్టూ సాయంత్రం వరకు మహిళలు దుస్తులు ఉతుకుతూ ఉండేవారు.
రెండు మోటార్ల ద్వారా ఈ బావి నీటిని పొలాలకు పెట్టే వాళ్లు. 
 – హనుమంతు, హాల్వి 

మరిన్ని వార్తలు