కృష్ణమ్మ కట్టడికి కర్ణాటక కాకి లెక్కలు!

24 Feb, 2021 05:20 IST|Sakshi

కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన జలాలు 734 టీఎంసీలు 

కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన మిగులు జలాలు 183 టీఎంసీలు 

కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ అదనపు వాటా 23 టీఎంసీలు 

నదుల అనుసంధానంతో మళ్లించే నీటికిగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా 216 టీఎంసీలు 

వెరసి కృష్ణా జలాల్లో 1,156 టీఎంసీల వాటా ఉందంటూ కర్ణాటక సర్కారు లెక్కలు 

ఆ నీటిని వాడుకునేలా ప్రాజెక్టులు చేపట్టేందుకు  మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని జలవనరుల శాఖకు ఆదేశం 

కేడబ్ల్యూడీటీ–2 తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంలో తెలుగు రాష్ట్రాల ఎస్సెల్పీ 

కోర్టు స్టే విధించడంతో ఆ తీర్పును ఇంతవరకూ నోటిఫై చేయని కేంద్రం 

అయినా సరే నీళ్లు వాడుకునేందుకు కర్ణాటక ఎత్తుగడ

సాక్షి, అమరావతి:  తెలుగు రాష్ట్రాల్లో సింహభాగం ప్రజలకు జీవనాధారమైన కృష్ణమ్మను కట్టడి చేసేందుకు కర్ణాటక సర్కారు కాకి లెక్కలతో మాస్టర్‌ ప్లాన్‌ వేసింది! సుప్రీం కోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కడంతోపాటు కేడబ్ల్యూడీటీ–2(కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌) తీర్పును కేంద్రం ఇంతవరకూ నోటిఫై చేయకున్నా ఆ తీర్పు ఆధారంగా దక్కిన 183 టీఎంసీల మిగులు జలాల్లో 174 టీఎంసీలను వినియోగించుకునేలా అప్పర్‌ కృష్ణా మూడో దశ పనులకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంపు పనులను చేపట్టింది. అక్కడితో ఆగలేదు సరికదా లేని హక్కులను ఉన్నట్లుగా చిత్రీకరించి అదనంగా నీటిని వాడుకోవడానికి ఎత్తులు వేస్తోంది.  

తనకు తానే వాటాలు.. 
కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అప్పటి పరిస్థితులను బట్టి కర్ణాటకకు 21 టీఎంసీలు అదనంగా కేటాయించే అంశాన్ని పరిశీలించాలని గోదావరి ట్రిబ్యునల్‌ పేర్కొంది. దీని ప్రకారం కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో తమకు 23 టీఎంసీలు (21 టీఎంసీలు + రెండు టీఎంసీలు పునరుత్పత్తి ద్వారా వచ్చే నీరు) వాటా వస్తుందని కర్ణాటక సర్కార్‌ లెక్కలు వేసింది. మరోవైపు ద్వీపకల్ప నదులైన మహానది, కృష్ణా, గోదావరి, కావేరి, పెన్నాను అనుసంధానం చేయడం ద్వారా ఒక బేసిన్‌ నుంచి మరో బేసిన్‌కు తరలించే నీటికిగాను కృష్ణా జలాల్లో తమకు అదనంగా 216 టీఎంసీలు వాటా వస్తుందని తేలి్చంది. వెరసి 1,156 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునేలా ప్రాజెక్టులను చేపట్టేందుకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని కర్ణాటక సర్కారు ఇటీవల ఆ రాష్ట్ర జలవనరులశాఖను ఆదేశించడంపై నీటిపారుదలరంగ నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేడబ్ల్యూడీటీ–2 తీర్పును కేంద్రం ఇప్పటిదాకా నోటిఫై చేయకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. అసలు ద్వీపకల్ప నదుల అనుసంధానం కార్యరూపం దాల్చేది ఎన్నడని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక సర్కార్‌ వాస్తవాలను విస్మరించి తనకు తానుగా వాటాలు కేటాయించుకుని ఆ మేరకు నీటిని వినియోగించుకోవడానికి ఏకపక్షంగా ప్రాజెక్టులను చేపడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి రాకుండానే.. 
కేడబ్ల్యూడీటీ–2 తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్సెలీ్ప)ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కేడబ్ల్యూడీటీ–2 తీర్పుపై స్టే ఇచ్చింది. దీంతో ఆ తీర్పును అమలు చేస్తూ కేంద్రం ఇప్పటిదాకా ఉత్తర్వులు (నోటిఫై) జారీ చేయలేదు. కృష్ణాలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కర్ణాటకకు 734 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. వాటిని కేడబ్ల్యూడీటీ–2 కొనసాగిస్తూనే 65 శాతం నీటి లభ్యతకూ.. 75 శాతం నీటి లభ్యతకు మధ్యన ఉన్న 448 టీఎంసీల మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు(కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌)కు కేటాయించింది. ఇందులో తమకు 183 టీఎంసీల వాటా వస్తుందని తేలి్చన కర్ణాటక అందులో 174 టీఎంసీలను వినియోగించుకోవడానికి అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టు మూడో దశ పనులను చేపట్టడానికి అనుమతి కోరుతూ సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం)కు ఇటీవలే డీపీఆర్‌ అందజేసింది. సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వకుండానే ఇప్పటికే పనులను కూడా ప్రారంభించడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు.   

అనుసంధానం వద్దంటూనే వాటాలు.. 
నదుల అనుసంధానం ద్వారా దుర్భిక్షాన్ని తరిమికొట్టాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు దిశానిర్దేశం చేసి రెండు దశాబ్దాలు పూర్తవుతున్నా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) 16 రకాల ప్రతిపాదనలు చేసింది. ఇందులో ఆల్మట్టి(కృష్ణా)–కాలువపల్లి(పెన్నా) అనుసంధానాన్ని కర్ణాటక ప్రభుత్వమే వ్యతిరేకిస్తోంది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు. దీంతో నదుల అనుసంధానం కేవలం కాగితాలకే పరిమితమైంది. ఒకవైపు  నదుల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్న కర్ణాటక సర్కార్‌ మరోవైపు ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడం ద్వారా ఒక బేసిన్‌ నుంచి మరొక బేసిన్‌కు మళ్లించే జలాలకుగానూ కృష్ణా జలాల్లో తమకు అదనంగా 216 టీఎంసీల వాటా వస్తుందని తనకు తానుగానే కేటాయించుకుని ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించడాన్ని నీటిపారుదల రంగ నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.  

మరిన్ని వార్తలు