సచివాలయ వ్యవస్థ సూపర్‌

28 Nov, 2020 03:19 IST|Sakshi
అనంతపురం జిల్లా కోడూరులోని రైతుభరోసా కేంద్రంలో అందుతున్న సేవలు, ప్రభుత్వ పథకాల గురించి ఐఏఎస్‌ల బృందానికి వివరిస్తున్న సచివాలయ ఉద్యోగి

దేశానికే ఆదర్శమని కర్ణాటక ఉన్నతాధికారుల బృందం ప్రశంస

అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో పర్యటన

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలపైనా ఆరా

సాక్షి, అమరావతి/ హిందూపురం సెంట్రల్‌: రాష్ట్రంలో ఏర్పాటైన గ్రామ సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శమని కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్‌ అధికారుల బృందం ప్రశంసలు కురిపించింది. సచివాలయాల పనితీరును పర్యవేక్షించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌ స్థాయి అధికారిని నియమించటం, సచివాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించ తలపెట్టడం వంటి చర్యలను అభినందించింది. ప్రజల జీవన ప్రమాణాలను దగ్గర నుండి పరిశీలిస్తూ, వారికి ప్రభుత్వ పథకాలు చేరవేసే సులభమైన విధానం సచివాలయ వ్యవస్థ అనే విషయం నిరూపితమైందని ఆ రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్‌ కొనియాడారు. సచివాలయ వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు కమిషనర్‌ నేతృత్వంలోని కర్ణాటక ఉన్నతాధికారుల బృందం శుక్రవారం అనంతపురంలో పర్యటించింది. 

ఉద్యోగులు, వలంటీర్లతో ముఖాముఖి
సోమందేపల్లి మండల కేంద్రంలో సచివాలయం–3ని సందర్శించి, వెలుగు కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో మాట్లాడారు. చిలమత్తూరు మండల కేంద్రంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) పరిశీలించారు. మండలంలోని కోడూరు మన్రోతోపులో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని చూశారు. అనంతరం చిలమత్తూరు రైతుభరోసా కేంద్రంలో సచివాలయ ఉద్యోగులు,  గ్రామ వలంటీర్లతో ముఖాముఖిగా మాట్లాడారు. సచివాలయాలు, ఆర్బీకేల్లో అందుతున్న సేవలు, పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ప్రజలతో తమ అనుభవాలు వివరిస్తున్నప్పుడు కమిషనర్‌ ప్రియాంక భావోద్వేగానికి లోనయ్యారు. సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ వలంటీర్ల సహకారం లేకపోతే తాము ఇంత తక్కువ కాలంలో ఇంతటి విజయాన్ని సాధించలేమంటూ కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బందితో కలసి తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వలంటీర్లు చేసిన సేవలను వివరించారు. అనంతరం కమిషనర్‌ ప్రియాంక మాట్లాదారు.
సచివాలయ ఉద్యోగితో పథకాల అమలుపై చర్చిస్తున్న ఐఏఏస్‌ నందిని   

4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఆషామాషీ కాదు
– సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నట్లు గుర్తించాం. 
– 2వేల జనాభాకు ఒక సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ ఏర్పాటు చారిత్రక నిర్ణయం. 
– సచివాలయాల ఏర్పాటు ద్వారా నాలుగు లక్షల పై చిలుకు ఉద్యోగాలు ఆషామాషీ కాదు. ఇది నిరుద్యోగులకు గొప్ప వరం.  
– రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు ఇంటి వద్దనే లభ్యమవడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ రైతులు అదృష్టవంతులనిపిస్తోంది.
– మహిళల సంక్షేమం కోసం సచివాలయానికో మహిళా సంరక్షకురాలి ఏర్పాటు అభినందనీయం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా