నేటి నుంచి కార్తీక మాస ప్రారంభం

16 Nov, 2020 08:21 IST|Sakshi

కార్తీక మాసం శివుడికి ప్రీతికర మాసం.. అందుకే దీన్ని పవిత్ర మాసంగా భావిస్తారు. సోమవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో దీపారాధన చేయడం ద్వారా సర్వపాపాలు హరించుకుపోతాయని ప్రజల నమ్మకం. తెల్లవారు జామునే నిద్రలేవడం.. కతికా నక్షత్రం అస్తమించేలోగా స్నానమాచరించడం, భోళాశంకరుడికి నిత్యం రుద్రాభిషేకం చేయడం, మెడలో రుద్రాక్షలు, తులసీ పూసల్ని ధరించడం, ఒక్కపూట మాత్రమే భోజనం చేయడం వంటి సంప్రదాయాలను ఆచరిస్తారు. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కార్తీక మాస ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. చదవండి: ధర్మ దాన దీపోత్సవం

తూర్పుగోదావరి జిల్లా : కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఐ పోలవరం మండలం మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో భక్తులు దర్శించుకుంటున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని శివనామ స్మరణతో కుండలేశ్వరం,ముమ్మిడివరం, తాళ్ళరేవు, యానంలోని శైవ క్షేత్రాలు మారుమ్రోగింది. మురమళ్ళ వృదగౌతమి గోదావరిలో తెలవారుజాము నుంచి భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాశివుని దర్షించుకునేందుకు ఆలయాల వద్ద  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్యూ లైన్లలో బారులు తీరుతున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కార్తీకమాస పర్వదిన సందర్భంగా శివనామ స్మరణతో దక్షిణ కాశి ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం మారుమ్రోగుతోంది. ఈ క్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. మొదటి కార్తీక సోమవారం  కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ స్వామివారిని, అమ్మవారిని భక్తులు దర్శించుకునేలా అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటిస్తూ స్వామివారిని, అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. కోవిడ్ ప్రభావంతో కార్తీక సోమవారం స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు స్వల్ప సంఖ్యలో హాజరయ్యారు. ఆలయంలో సప్త గోదావరి నదిలో స్నానాలు నిలిపివేశారు. అభిషేకాలు, కుంకుమ పూజలు, దీపారాధనల కూడా నిషేధించారు.

పోటెత్తిన భక్తులు
రాజమండ్రి గోదావరి ఘాట్‌లో భక్తుల పుణ్యస్నానాలు, దీపారాధనలు చేపట్టారు. ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నవరం, పిఠాపురం పాదగయా క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. పాలకొల్లు శ్రీక్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, భీమవరం శ్రీఉమాసోమేశ్వరజనార్దన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులకు అధికారులు దర్శనం కల్పిస్తున్నారు. అమర లింగేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సామూహిక నదీస్నానాలకు అనుమతించలేదు. 

కర్నూలు జిల్లా శ్రీశైలం : శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4గంటలు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనాలు ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతీరోజు నాలుగు విడతలుగా ఆర్జిత  సామూహిక అభిషేకాలు నిర్వహించారు.  
      
ఏకాదశ రుద్రాభిషేకం
రాజన్నసిరిసిల్లా జిల్లా : కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. స్వామివారికి అర్చకులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన చేయనున్నారు.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా : కార్తీక మాస సందర్భంగా చర్ల మండలంలోని శ్రీ ఉమారామళింగేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 

పశ్చిమగోదావరి జిల్లా : కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో కార్తీక మాసం మొదటి రోజు సోమవారం కావడంతో భక్తిశ్రద్ధలతో గోదావరి నదిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. శివ నామస్మరణతో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సుందరేశ్వర స్వామి దేవాలయం మార్మోగుతుంది. కరోనా ప్రభావంతో భక్తులు అంతగా లేక పవిత్ర గోష్పాద క్షేత్రం వేలవేల పోయింది. మాస్కు ధరించి శివపార్వతులను పలువురు భక్తులు దర్శించుకున్నారు. పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం ప్రత్యేక పూజలు చేపట్టారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సామూహిక నది స్నానాలకు అనుమతి లేదు
విజయవాడ : కార్తీకమాసం మొదటి సోమవారం భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. కార్తీక దీపారాధన కోసం పెద్ద సంఖ్యలో భక్తుల పూజలు నిర్వహిస్తున్నారు. అభిషేకాల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  కోవిడ్ కారణంగా ఘాట్‌లలో స్నానం చేయడానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు.

గుంటూరు : కార్తీక సోమవారం కావడంతో అమరావతి అమరలింగేశ్వర స్వామి దర్శించుకోడానికి భారీ స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అధికారులు కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. సామూహిక నదీ స్నానాలకు అధికారులు అనుమతించలేదు. సామూహిక దీపారాధనకు కూడా అనుమతి లేదు.

మరిన్ని వార్తలు