యాదవుల అభ్యున్నతికి ప్రణాళిక

25 Apr, 2022 04:49 IST|Sakshi
యాదవ మహాసంఘం ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి కారుమూరి

అఖిలభారత యాదవ మహాసంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

భవానీపురం (విజయవాడ పశ్చిమ): బీసీల్లో యాదవులను అతి పెద్ద క్యాస్ట్‌గా ప్రభుత్వం గుర్తించిందని, అందుకే మన జాతి అభ్యున్నతికి ఒక ప్రణాళిక సిద్ధం అవుతోందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు చెప్పారు. అఖిలభారత యాదవ మహాసంఘం ఆవిర్భావం సందర్భంగా ఆదివారం విజయవాడలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాజికవర్గానికి సంబంధించిన సంఘాలన్నీ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చి జెడ్పీ చైర్మన్‌ను చేశారని గుర్తుచేశారు.

తనకు మంత్రిపదవి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. యాదవ జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నానని, జాతి తలదించుకునే పని మాత్రం చేయనని స్పష్టంచేశారు. యాదవ జాతి ఒక్కటే ఓట్లు వేస్తే గెలవలేదని, మిగిలిన సామాజికవర్గాల ప్రజల మద్దతు కూడా లభించటం వల్లనే విజయం సాధించానని తెలిపారు. ప్రాంతాలను, పార్టీలను, కులమతాలను చూడం.. అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్న విధంగా తుదిశ్వాస వరకు అందరివాడిగానే ఉంటానని చెప్పారు. ఏపీలో ప్రతి జిల్లాలో యాదవభవన్‌ కోసం కనీసం రెండెకరాలు ఇప్పించాలని తెలంగాణ నుంచి వచ్చిన వి.చినశ్రీశైలంయాదవ్‌ కోరగా.. ప్రతి జిల్లాలో ఒక ఎకరం, హెడ్‌క్వార్టర్‌లో ఐదెకరాలు ఇప్పించేందుకు కృషిచేస్తానని మంత్రి చెప్పారు. 

బీసీ వర్గాలకు జెండా, అజెండా ఉండాలి
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ సంఘాలు రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉండాలన్నారు. బీసీ వర్గాలకు ఒక జెండా, అజెండా ఉండాలని చెప్పారు. సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ బొడ్డు రమేష్‌యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన దేవస్థానాల్లో సన్నిధి గొల్లలకు చట్టబద్ధత కల్పించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 45 ఏళ్లు దాటిన గీత, చేనేత కార్మికులకు ఇచ్చినట్లుగానే గొర్రెల కాపలాదారులకు కూడా పెన్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘం జాతీయ అధ్యక్షుడు బి.లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు యు.పేరయ్య, నేతలు బచ్చుల అర్జునుడు, పీఎల్‌పీయాదవ్, ముద్రబోయిన వెంకటేశ్వరరావు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణయ్య, సంఘం కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల అధ్యక్షులు ఎన్‌.సునీల్, ఆర్‌.సత్యశేఖర్, ఉమ్మడి కృష్ణాజిల్లాలోని యాదవ సామాజికవర్గ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు