నూనెలు అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు 

27 Apr, 2022 05:20 IST|Sakshi
సచివాలయంలో అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి

ధరల నియంత్రణపై అధికారులతో సమీక్ష

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసరాలు, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని  పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. వంటనూనెల ధరల నియంత్రణపై మంగళవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కృత్రిమ కొరత సృష్టించి వంట నూనెలను అధిక రేట్లకు విక్రయించినా, పరిమితికి మించి నిల్వలు ఉంచినా బైండోవర్‌ కేసులు నమో దు చేయాలని ఆదేశించారు. బ్లాక్‌ మార్కెట్‌ దందా పై నిరంతరం నిఘా ఉంచి, ఎప్పటికప్పుడు వ్యాపా ర దుకాణాలు, నూనె తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రణాళిక ప్రకారం రైతుబజా రులు, మున్సిపల్‌ మార్కెట్‌లలో ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు చేసి, బయటి ధరల కంటే తక్కువకు వంటనూనెలను అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా మండలాల వారీగా నూనె ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాల న్నారు.

సోయాబీన్, రైస్‌ బ్రాన్‌ నూనెల వాడకాన్ని ప్రోత్సహించాలి
పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై ఆంక్షలున్న నేపథ్యంలో సోయాబీన్, రైస్‌ బ్రాన్‌ నూనెల వాడకం వైపు ప్రజలను ప్రోత్సహించాలని మంత్రి కారుమూరి సూచించారు. ఆ నూనెలను ఆయిల్‌ ఫెడ్‌ ద్వారా విక్రయించడంతో పాటు కనోల ఆయిల్‌ (ఆవనూనె) అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. పామ్‌ ఆయిల్‌ సాగును ప్రోత్సహించి, సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. బ్లాక్‌ మార్కెట్, కల్తీ నూనెల విషయంలో ఇప్పటి వరకు 76 కేసులు నమోదు చేశామని, 22,598 క్వింటాళ్ల నూనెలను జప్తు చేశామని మంత్రి వివరించారు. వీటిల్లో కేసులు పరిష్కరించిన బ్రాండ్లను తిరిగి మార్కెట్‌లోకి విడుదల చేసినట్టు చెప్పారు. సమీక్షలో పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎండీ వీరపాండియన్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ శంకబ్రత బాగ్చి, మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదనరెడ్డి, లీగల్‌ మెట్రాలజీ కంట్రోలర్‌ కిశోర్‌కుమార్, రైతుబజార్‌ సీఈవో శ్రీనివాస రావు, ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీ బాబురావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు