మూడు కోట్లు మూసీలో పోశారు! 

1 Oct, 2020 09:37 IST|Sakshi
కాశీపురం ఎత్తిపోతల పథకం- (ఇన్‌సెట్‌లో) మూసీనదిలో నీటి సరçఫరా కోసం ఏర్పాటు చేసిన ఫిల్టరు

వినియోగంలోకి రాని ఎత్తిపోతల పథకం 

పునర్నిర్మాణం పేరుతో గత పాలకుల మొక్కుబడి పనులు 

బీడుగా మారిన 625 ఎకరాలు

ఇబ్బందిపడుతున్న ఆయకట్టుదారులు

వృథా నీటిని వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షంగా  మార్చాలన్న తలంపుతో మూడు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల నిరుపయోగంగా మారింది. పథకం ఏర్పాటు లక్ష్యం మంచిదైనప్పటీకీ అధికారుల నిర్ణయాలు, ప్రజా ప్రతినిధుల దురాలోచనలతో అది మూలనపడింది. దీంతో రైతులకు మేలు జరగక పోగా, కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. ఈ కోవకు చెందినదే పొదిలి మండలంలోని పాములపాడు పంచాయతీలో గల కాశీపురం ఎత్తిపోతల పథకం.  

పొదిలి రూరల్‌: పొలం పక్కనే నీరు ప్రవహిస్తున్నా అది పైర్లకు ఉపయోగపడకపోవడంతో అప్పటి ప్రభుత్వం ఆ నీటిని సాగుభూములకు అందించేందుకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసింది. మండలంలోని పాములపాడు, గొల్లపల్లి, కాశీపురం గ్రామాలకు చెందిన 625 ఎకరాలకు నీరు అందించే ఉద్దేశంతో 1988–89 సంవత్సరంలో దాదాపు రూ.20 లక్షల  వ్యయంతో మూíసీనదిపై ఈ పథకాన్ని నిర్మించారు. దీనికి 25 హెచ్‌పీ సామర్ధ్యం గల మూడు విద్యుత్‌ మోటార్లు, నీటి సరఫరాకు పైపు లైన్‌లు ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో కాకున్నా పథకం మొదట్లో కొంతమేరకు పనిచేసింది. నీటి సరఫరా లేక సాగు తగ్గి నిర్వహణ లోపంతో మూడేళ్ల అనంతరం రైతులు ఒక లక్ష రూపాయలు పైబడి విద్యుత్‌ బకాయిలు పడ్డారు.

కరెంట్‌ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా అధికారులు సరఫరా తొలగించారు. పథకం పని చేయక పోవడంతో మోటార్లు, భవనం తలుపులు, కిటికీలు దొంగలు ఎత్తుకుపోయారు. దీంతో అక్కడ పిచ్చి చెట్లు పెరిగి సాగు భూములు బీడుగా మారాయి. ప్రజల విన్నపం మేరకు తరువాత వచ్చిన ప్రభుత్వాలు పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో కదిలిన యంత్రాంగం పథకం గ్రౌండ్‌ రిపోర్టు తయారు చేసింది. రైతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అభిప్రాయాలు తెలుసుకొని పథకానికి అక్కడ అనువైన ప్రాంతం కాదని, కుంచేపల్లి మూసీనది మాగాణి వద్ద ఏర్పాటు చేస్తే ఉపయోగకరమని పెర్కొంటూ నివేదిక పంపించారు.
 
గత టీడీపీ ప్రభుత్వంలో కాసులకు కక్కుర్తిపడి: 
కాశీపురం ఎత్తిపోతల పథకంను కుంచేపల్లి వద్ద పునర్నిర్మాణం చేస్తే ఉపయోగకరంగా  ఉంటుందని రైతులు, అధికారులు మొత్తుకున్నా వారి మాటలును గత తెలుగుదేశేం ప్రభుత్వం పట్టించుకోలేదు. కాసుల కోసం కక్కుర్తి పడి ఆపార్టీ నాయకులు అప్పటి అధికారులపై వత్తిడి తెచ్చి పనిచేయని పథకానికి మరమ్మతుల కోసం రూ.3.20 కోట్లతో ఎస్టిమెషన్‌ వేయించి మంజూరు చేయించారు. ఈ పథకానికి 10 క్యూసెక్కులు నీటి పరిమాణం అవసరమని అధికారులు గుర్తించారు. దానికి తగ్గట్టు బావి, సంపు నిర్మాణాలు చేపట్టినట్లు కాకి లేక్కలు చూపి పాత పథకానికే ఏవో కొన్ని మొక్కుబడి పనులు చేసి మసిపూచి మారేడుకాయ చేశారు. పాత భవనాన్ని మర్మతులు చేసి, తలపులు బిగించి, మోటార్లు రీపేరు చేయించి, ట్రాన్స్‌పార్మర్లు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు.

పథకానికి నీరు రావాలంటే మూసీ నదిలో నీరు నిల్వ ఉండాలి. నీరు నిల్వ ఉండాలంటే నదికి అడ్డంగా కట్టనిర్మించాలి. కానీ ఇక్కడ అలాంటి పని చేయలేదు. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించినా పథకం పనిచేయలేదు. మూసీనదిలో ఇసుక మేట వేయడం, పథకం ప్రాంతంలో చిల్ల చెట్లు పెరిగి అడవిని తలపిస్తుంది. దీంతో ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పటికీ నది వద్ద చుక్కనీరు నిల్వ ఉండక పోవడం కొసమేరుపు. వందలాది ఎకరాల భూములు బీడుగా ఉన్నాయని, ఈ స్కీం వినియోగంలోకి తీసుకురాక పోతే మరలా సామగ్రి దొంగల పాలౌతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు పక్షపాతిగా ఖ్యాతిగాంచిన ప్రస్తుత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమైనా నదిలో నీరు నిల్వ ఉండటానికి అడ్డు కట్ట వేసి ఈ స్కీం వినియోగంలోకి తీసురావాలని ఆయకట్టుదారులు కోరుతున్నారు.    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు