ఆర్థికాభివృద్ధికి విద్య బలమైన సాధనం: గవర్నర్ హరిచందన్ 

9 Jan, 2023 17:27 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏ సమాజమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్య అత్యంత బలమైన సాధనమని, విద్య, పేదరికం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వెనిగండ్ల గ్రామం కౌండిన్యపురంలో సోమవారం నిర్వహించిన ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రస్టు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కౌండిన్య ఐఎఎస్ అకాడమీని గవర్నర్ ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని అర్హులైన పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ ఒక వ్యక్తి మంచి విద్యాధికునిగా మారినప్పడు గణనీయమైన ఆదాయార్జనతో పేదరికం నుండి బయటపడే అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గత కొన్ని సంవత్సరాలలో సుమారు 4,500 మంది పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.96 లక్షల ఉపకార వేతనాలు అందించడం అభినందనీయమన్నారు. సమాజంలో అర్హులైన బలహీన వర్గాల విద్యార్థులకు శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఔత్సాహిక విద్యార్థులకు మేలు చేకూర్చుతుందన్నారు.

జాతీయ విద్యా విధానం-2020 విద్యారంగంలో పెద్ద సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. రాబోయే దశాబ్దాల్లో భారతదేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చగలదని గవర్నర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణు గోపాల్ రెడ్డి, ట్రస్టు వ్యవస్ధాపకులు, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఇ.వి. నారాయణ, వాణిజ్య పన్నుల శాఖ మాజీ అదనపు కమిషనర్ వై. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు