భర్త వేధింపులే ఉసురు తీశాయి 

12 Oct, 2020 08:45 IST|Sakshi
భర్త పిల్లలతో కీర్తి ( ఫైల్‌ ఫొటో)

సాక్షి, కర్నూలు: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం నంద్యాల పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.నంద్యాల టూటౌన్‌ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ మండలం ముత్తలూరు గ్రామానికి చెందిన గండ్ర పుల్లయ్య వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన కీర్తి (33)ని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ విద్యావంతులు కావటంతో పెళ్లి అనంతరం  ఉద్యోగం కోసం నంద్యాల పట్టణానికి వచ్చి ఎస్‌బీఐ కాలనీలో ఉంటున్నారు. స్థానిక నాగార్జున ప్రైవేట్‌ కళాశాలలో లెక్చరర్‌గా పుల్లయ్య,  గుడ్‌షెప్పర్డ్‌ స్కూల్‌లో  టీచర్‌గా  కీర్తి ఉద్యోగంలో చేరారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం. సంతోషంగా సాగుతున్న వీరి సంసార  జీవితంలో ఓ యువతి చిచ్చురేపింది.  

నాగార్జున కాలేజీలో చదువుకున్న సుభాషిణి ప్రస్తుతం నంద్యాల తహసీల్దార్‌ కార్యాలయం పక్కనే ఉన్న ట్రెజరీ కార్యాలయంలో అసిస్టెంట్‌ క్లర్క్‌గా పనిచేస్తోంది. ఈ యువతి పుల్లయ్య స్టూడెంట్‌. ఇద్దరి మధ్య  ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయంలో పుల్లయ్య, కీర్తి  మధ్య మనస్పర్థలు తలెత్తాయి.  ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం  ఏకంగా సుభాషిణిని రెండో పెళ్లి చేసుకుని ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను కీర్తి సెల్‌కు పంపి వేధించేవారు.తమకు అడ్డుగా ఉన్నావంటూ సుభాషిణి తరచూ ఆమె ఫోన్‌కు మెసేజ్‌లు పెట్టడం, మరోవైపు భర్త  కూడా మానసికంగా వేధింపులకు గురిచేయడంతో జీవితంపై విరక్తి చెందిన కీర్తి శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు   
కీర్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న  కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అనుమానం వ్యక్తం చేస్తూ  పుల్లయ్యకు దేహశుద్ధి చేయడంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. రెండో భార్య సుభాషిణి కూడా  ఇంటికి తాళం వేసి వెళ్లింది. కాగా తన  కుమార్తె చావుకు అల్లుడు, అతని రెండో భార్య సుభాషిణే కారణమని మృతురాలి తల్లి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు  టూటౌన్‌ సీఐ కంబగిరిరాముడు తెలిపారు.

మరిన్ని వార్తలు