రైతు భరోసా పథకం భేష్‌

17 Oct, 2021 04:32 IST|Sakshi
కామవరపుకోట మండలం తాడిచర్లలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తున్న కేరళ వ్యవసాయ మంత్రి ప్రసాద్‌

కేరళ వ్యవసాయ శాఖ మంత్రి కితాబు

చింతలపూడి: ఏపీలో అమలవుతున్న రైతు భరోసా పథకం కాన్సెప్ట్‌ చాలా బాగుందని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తాడిచర్ల గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని తన బృందంతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సాగు పద్ధతులు, దిగుబడి, లాభనష్టాల గురించి రైతులతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఇక్కడి రైతులు రైతు భరోసా పథకం వల్ల ఒనగూరుతున్న ప్రయోజనాల్ని కేరళ మంత్రికి వివరించారు. మరోవైపు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అన్నిరకాల సేవలనూ ఒకేచోట అందుబాటులోకి తెచ్చారని వివరించారు. దీంతో ఆయన రైతు భరోసా కేంద్రాలు, వాటి పనితీరును గురించి స్థానిక అధికారులను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలతో పాటు జిల్లాలోని నవధాన్యాలు, వరి, ఆయిల్‌పామ్‌ తోటలను కూడా పరిశీలించారు. ఇక్కడి రైతులు అవలంబిస్తున్న సాగు విధానాలను తెలుసుకున్నారు. ఆయన వెంట స్టేట్‌ హెడ్‌ విజయకుమార్, జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) అంబేడ్కర్, జేడీఏ ఎం.జగ్గారావు, సర్పంచ్‌ పార్థసారథి, ఏడీ పీజీ బుజ్జిబాబు తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు