ఆర్బీకేల సేవలు అద్భుతం

16 Oct, 2022 04:10 IST|Sakshi
గండిగుంట ఆర్బీకేలో వివరాలు తెలుసుకుంటున్న కేరళ బృందం

కేరళ బృందం ప్రశంసలు

సాక్షి, అమరావతి/ఉయ్యూరు/గన్నవరం: ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాల సేవలు అద్భుతమని కేరళ అధికారులు ప్రశంసించారు. ఏపీ తరహాలోనే సమీకృత సమాచార కేంద్రం (ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌)ను కేరళలో ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల వారీగా ఏపీ ప్రభుత్వం తెస్తున్న మ్యాగజైన్లతోపాటు వ్యవసాయ, ఉద్యాన పంచాంగాలను ఈ వ్యవసాయ సీజన్‌ నుంచి తమ రాష్ట్రంలోనూ తెస్తామన్నారు.

ఈ మేరకు కేరళ వ్యవసాయ శాఖ సంచాలకులు టీవీ సుభాష్‌ సారథ్యంలో కేరళ ప్రైస్‌ బోర్డు చైర్మన్‌ డాక్టర్‌ రాజశేఖరన్‌ నాయర్, వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి సబీర్‌ హుస్సేన్, అదనపు సంచాలకుడు సునీల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం శనివారం రాష్ట్రంలో పర్యటించింది.

ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ (ఐసీసీ), ఆర్బీకే చానల్‌ను సందర్శించింది. అనంతరం ఉయ్యూరు మండలం గండిగుంటలో ఆర్బీకే–2ను సందర్శించి రైతులతో భేటీ అయ్యారు. వ్యవసాయ సలహా మండళ్ల సేవలతో పాటు పొలం బడి, డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవల వివరాలను తెలుసుకున్నారు.

ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం..
ఆర్బీకే సందర్శన తర్వాత కేరళ బృందం విజయవాడలో అధికారులతో సమావేశమైంది. గత మూడేళ్లుగా వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు, ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలపై ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామ స్థాయిలో రైతులకు సేవలందిస్తున్న తీరు నిజంగా అద్భుతం. టెక్నాలజీని ఇంతలా వినియోగించుకుంటున్న ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదు. ఐసీసీ ద్వారా శాస్త్రవేత్తలతో రైతులకు సాగు సలహాలు ఇప్పించడం, ఆర్బీకేల్లోని కియోస్క్‌లో బుక్‌ చేసుకోగానే నేరుగా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఇస్తున్న విధానం చాలా బాగుంది.

ఆర్బీకేల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తున్న తీరు అద్భుతం. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హ్యాట్సాఫ్‌. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం.
– టీవీ సుభాష్, డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్, కేరళ 

మరిన్ని వార్తలు