కోర్టును తప్పుదోవ పట్టిస్తున్న బిగ్‌బాస్‌ నిర్వాహకులు: కేతిరెడ్డి

5 May, 2022 19:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోర్టును బిగ్‌బాస్‌ నిర్వాహకులు తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుగు యువశక్తి అధ్యక్షులు, ప్రముఖ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. బిగ్‌బాస్‌-3 జరుగుతున్న సందర్భంగా 2019లో మొదట తెలంగాణ హైకోర్టు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటీగేషన్‌ దాఖలు చేశామన్నారు. అందులో  ‘‘బిగ్‌బాస్‌ సెలక్షన్స్‌ పేరుతో అమ్మాయిలను మోసగిస్తున్నారని, ఈ షో వలన సమాజానికి ఎంతో హానికరమని, ముఖ్యంగా యువత పెడమార్గంలో నడవడానికి ఈ షో కారణం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు.

ఈ షోని రద్దు చేయాలని, 24 గంటల షూట్‌ చేసి కేవలం ఒక గంట మాత్రమే ప్రసారం చేయటం, ఓటింగ్‌ పేరుతో జరుగుతున్న అవకతవకలు, గేమ్‌ షో పేరుతో అసభ్యకర సన్నివేశాలు అభ్యంతరకరమని పేర్కొన్నట్లు కేతిరెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ హైకోర్టు దీనిపై కొన్ని వ్యాఖ్యలు చేసిందన్నారు. ఈ షోలు టెలికాస్ట్‌ కాకుండా ఆపేసే హక్కులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని జాగ్రత తీసుకోవాలని పేర్కొంది. బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా వేసిన కేసు వెనక్కి తీసుకోలేదని, దీనిపై పోరాటం కొనసాగిస్తామని కేతిరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు