సీఎం జగన్‌కు నిర్మాత కేతిరెడ్డి ధన్యవాదాలు

25 Nov, 2021 19:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: గత కొన్ని ఏళ్లుగా పరిశ్రమలోని ఇష్టం వచ్చిన రేట్లకు సినిమా టిక్కెట్లు అమ్మడాన్ని చిన్న నిర్మాతలు వ్యతిరేకిస్తూ వస్తున్నారని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవవరించినందుకు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

గత ప్రభుత్వలు చిన్న నిర్మాతల కోర్కెలను పెడచెవిన పెట్టడం జరిగిందని.. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన స్లాబ్ సిస్టమ్‌ను రద్దు చేశారని తెలిపారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్‌ సినిమా చూసే ప్రేక్షకులకు గతంలో సినిమా పెనుభారంగా ఉందన్న విషయాన్ని గుర్తించి ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్స్ అమ్మకాలను తీసుకువచ్చారని అన్నారు. అదేవిధంగా 4 ఆటలు మించి ప్రదర్శన చేయకుండా ఉండేందుకు సినిమాటోగ్రఫీ యాక్టును సవరించి అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం చిన్న సినిమా నిర్మాతలు, పరిశ్రమకు ఓ వరమని పేర్కొన్నారు.

సినిమాలో ఉన్న సెలబ్రిటీల కంటే తనకు ప్రజలే ముఖ్యమని ఈ చట్టం ద్వారా తెలియచేయడం సీఎం జగన్‌ పరిపాలనా దక్షతకు నిదర్శనమని చెప్పారు. ఇటు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు.. అటు నిర్మాతలు ఈ నిర్ణయానికి  హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొంతమంది ప్రయోజనల కోసం కాకుండా ఈ నిర్ణయంతో  కోట్లాది సినీ ప్రేక్షకులకు సీఎం జగన్‌ ఓ ఆణిముత్యం అయ్యారని చెప్పారు. తిరిగి తెలుగు సినీ పరిశ్రమ వైభవంగా ముందుకు సాగుతుందని, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చట్ట సవరణ చేసి పరిశ్రమ అభివృద్ధికి దోహదపడాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఓ ప్రకటనలో కోరారు.

మరిన్ని వార్తలు