భూ హక్కుకు.. శ్రీరామరక్ష!

24 Sep, 2022 05:13 IST|Sakshi

ధ్రువీకరించిన భూ యాజమాన్య హక్కులతో ప్రత్యేక రిజిస్టర్‌

వివాదాల్లేని భూముల టైటిల్‌తో రిజిస్టర్‌ నిర్వహణ.. ఈ రిజిస్టర్‌ నిర్వహణకు ప్రత్యేక ప్రాధికార సంస్థ 

భూ హక్కు యాజమాన్య చట్టంలో కీలక మార్పులు 

రీ సర్వేతో సమూలంగా మారనున్న భూముల నిర్వహణ వ్యవస్థ 

సాక్షి, అమరావతి: భూముల హక్కుదారుల భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులేస్తోంది. భూమిపై కచ్చితమైన యాజమాన్య హక్కులను నిర్థారించేందుకు సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. ధ్రువీకరించిన భూ యాజమాన్య హక్కుల(కన్‌ఫర్మ్‌డ్‌ టైటిల్‌ విధానం) వివరాలతో ప్రత్యేక రిజిస్టర్ల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భూ హక్కు యాజమాన్య చట్టంలో కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా కీలక మార్పులు చేసింది. కొత్తగా రూపొందించిన భూ హక్కు యాజమాన్య చట్టానికి శాసనసభ ఆమోదం తెలిపింది. 

వివాదాల పరిష్కారానికి సరికొత్త మార్గం 
పలు వివాదాలతో ప్రస్తుతం భూముల యాజమాన్యం అత్యంత సంక్లిష్టంగా మారిన విషయం తెలిసిందే. వివాదాలు లేకుండా ఉన్న కచ్చితమైన భూ హక్కుదారుల వివరాలు తెలుసుకోవడం క్లిష్టంగా మారింది. కన్‌ఫర్మ్‌డ్‌ టైటిల్‌ విధానంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) సాయిప్రసాద్‌ చెప్పారు.

దేశంలో భూమిపై హక్కుల్ని నిర్థారించే అధికారం సివిల్‌ కోర్టులకు మాత్రమే ఉంది. ఒక వ్యక్తి అంతా సక్రమంగా ఉందని భావించి భూమి కొనుగోలు చేశాక, దానిపై తనకూ హక్కు ఉందని ఎవరైనా కోర్టుకు వెళితే అది వివాదంలో కూరుకుపోతోంది. అన్ని ఆధారాలు పరిశీలించి సివిల్‌ కోర్టు చేసిన నిర్థారణే ఇలాంటి కేసుల్లో అంతిమం. ఆ భూమిపై పలానా వ్యక్తికి మాత్రమే హక్కు ఉందని కచ్చితంగా చెప్పే వ్యవస్థ రెవెన్యూ శాఖలో లేదు. రెవెన్యూ రికార్డులు, ఆస్తుల్ని రిజిస్టర్‌ చేసే విధానం కూడా ఇలాంటి వివాదాలకు పరష్కారాలు సూచించేలా లేదు. వీటన్నింటికీ కన్‌ఫర్మ్‌డ్‌ టైటిల్‌ విధానం పరిష్కారం చూపనుంది. 

భూ యాజమాన్య హక్కుల రిజిస్టర్లు
భూముల రీ సర్వే జరుగుతున్న క్రమంలో ప్రతి గ్రామంలో ధ్రువీకరించిన భూ యాజమాన్య హక్కుల రిజిస్టర్లు తయారవుతాయి. ఆ రిజిస్టర్లలో ఆ గ్రామానికి చెందిన పక్కా యాజమాన్య హక్కులున్న భూముల వివరాలుంటాయి. ఎవరైనా ఆ భూములపై వివాదాలు సృష్టించేందుకు కోర్టుకెళ్లినా.. ఈ రిజిస్టర్ల ఆధారంగా కోర్టు వాటిని కొట్టేస్తోంది. దీనివల్ల భూ యజమానులకు భద్రత ఏర్పడుతుంది. ఇందుకోసమే అనేక మార్పులతో కొత్త భూ హక్కు యాజమాన్య చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.

దీని ప్రకారం రాష్ట్రంలో ఉన్న స్థిరాస్తుల రికార్డులను తయారు చేసి వాటిని పక్కాగా నిర్వహిస్తారు. ఈ హక్కుల రికార్డుల ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగేందుకు వీలవుతుంది. భూములకు సంబంధించిన డిజిటల్‌ రికార్డులు తయారవుతాయి. ఈ రికార్డుల నిర్వహణ బాధ్యతలు చూసేందుకు కొత్తగా రాష్ట్ర స్థాయిలో భూ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయనున్నారు. దీని చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి హోదాకు తగ్గని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ సంస్థ భూమి హక్కుల రియల్‌ టైమ్‌ డేటాను తయారు చేసి వాటిని నిర్వహిస్తుంది. హామీతో కూడిన హక్కుల యాజమాన్య విధానం అమల్లోకొస్తుంది. 

మరిన్ని వార్తలు