AP Crime: తల్లీకూతుళ్ల సజీవ దహనం కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి..

7 Jul, 2022 08:31 IST|Sakshi
మృతిచెందిన సాధనాల మంగాదేవి, మేడిశెట్టి జ్యోతి

ప్రియుడి కోసం బయటపడిన ఓ మహిళ పన్నాగం 

సాక్షి, కోనసీమ(అల్లవరం): తల్లీకుమార్తెల సజీవ దహనం కేసు మిస్టరీ వీడింది. మాజీ ప్రియుడ్ని తన వైపు తిప్పుకునే క్రమంలో ఓ మహిళ పన్నాగానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తేల్చారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఈ నెల 2వ తేది తెల్లవారుజామున సాధనాల మంగాదేవి, మేడిశెట్టి జ్యోతి సజీవదహనమైన సంగతి తెలిసిందే. అమలాపురం రూరల్‌ సీఐ వీరబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొమరగిరిపట్నానికి చెందిన సురేష్, జ్యోతి ప్రేమించుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకుని గోడితిప్పలో నివసిస్తున్నారు.

అంతకుముందు సురేష్‌కు నాగలక్ష్మి అనే వివాహితతో వివాహేతర సంబంధముండేది. పెళ్లయిన తర్వాత ఆమెకు దూరమవడంతో నాగలక్ష్మి ఎలాగైనా జ్యోతి సురేష్‌లను విడదీయాలనుకుంది. ఇందులో భాగంగా సురేష్‌ ఇంటి వద్ద ఆకాశరామన్న ఉత్తరాలు రాసి పడేసేది. ఇందుకు తన సవతి కుమార్తెలు సౌజన్య, దివ్య హరితలను వినియోగించుకునేది. ఆ ఉత్తరాలలో జ్యోతికి అక్రమ సంబంధం ఉన్నట్లు రాసేవారు. వాటిని చదివినా సురేష్‌ ఆమెతో ప్రేమగానే ఉండేవాడు. ఇలా కాదని జ్యోతిని హతమారిస్తే సురేష్‌ తనకు దగ్గరవుతాడని భావించింది. ఇదే సమయంలో జ్యోతి తన పుట్టింటికి వెళ్లింది.

చదవండి: (తీరని శోకం: రెండు కుటుంబాలు.. నలుగురు బిడ్డలు..)

ఈనెల 2వ తేదీ రాత్రి తన తల్లి సాధనాల మంగాదేవితో కలిసి పడుకుంది. ఇదే అదునుగా నాగలక్ష్మి తన సవతి కుమార్తెలిద్దరినీ ఉసి గొల్పింది. నిద్రిస్తున్న తల్లీ కూతుళ్లపై పెట్రోలు పోయాలని చెప్పింది. వారు ఇంట్లోకి వెళ్లి తల్లీకూతుళ్లపై పెట్రోలు పోసి బయటకు వచ్చి నిప్పంటించారు. కాసేపటికే మంటలు ఎగసిపడుతుండటంతో జ్యోతి తండ్రి లింగన్న మేల్కొన్నాడు. మంటలను ఆర్పేందుకు విఫలయత్నం చేశాడు. అప్పటికే మంగాదేవి, జ్యోతి సజీవ దహనమయ్యారు.

పోలీసులు కేసు నమోదు చేసి చురుగ్గా దర్యాప్తు చేశారు. ఈ హత్యతో సంబంధమున్న నాగలక్ష్మ,  సౌజన్య, దివ్య హరితలను బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వీరికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించారు. నిందితులనురాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. దర్యాప్తులో ఎస్సై ప్రభాకరరావు, కానిస్టేబుళ్లు ధర్మరాజు, సుభాకర్, క్రైం పార్టీకి చెందిన కానిస్టేబుల్‌ బాలకృష్ణ, రామచంద్రరావు, జి.కృష్ణసాయి, డి.అర్జున్‌ కీలక భూమిక పోషించారు.

చదవండి: (ఏఈ హత్య కేసు: భార్యే కుంటలో వేసి తొక్కి.. ఏమీ ఎరగనట్లు) 

మరిన్ని వార్తలు