మీకు కరెంట్‌ బిల్లు తగ్గాలా.. ఇలా చేయండి!

12 Nov, 2020 20:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 ఏసీలు, గీజర్లు ఇలా వాడండి

శ్లాబు మారితే జేబుకు చిల్లే

పద్దతులు పాటిస్తే డబ్బులు ఆదా

విద్యుత్‌ శాఖ సూచనలు

సాక్షి, అమరావతి : మన ఇంట్లో ఉన్న విద్యుత్‌ ఉపకరణాలను సరైన విధానంలో వాడితే జేబుకు చిల్లు పెట్టే కరెంటు బిల్లులను కొంత తగ్గించుకోవచ్చని విద్యుత్‌ అధికారులు అంటున్నారు. గత నెలలో వచ్చిన కరెంటు బిల్లు కంటే ఈ నెల ఎక్కువ ఎందుకు వచ్చిందని తలపట్టుకునే ముందు ఇంట్లో ఉన్న ఏసీ, రిఫ్రిజ్‌రేటర్‌, గీజర్‌, ఒవెన్‌ తదితర విద్యుత్‌ ఉపకరణాలను మనం వాడే తీరుపై ఒకసారి దృష్టి సారించాలని సూచిస్తున్నారు. వాడకం పెరిగి యూనిట్లు పెరిగేకొద్దీ శ్లాబు మారి బిల్లు పెరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే విద్యుత్‌ మీటర్లను గిరగిరా తిప్పే వస్తువులను క్రమపద్దతిలో వాడితే అధిక బిల్లులను నివారించుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. నిపుణులు చేసిన కొన్ని సూచనలను మీడియాకు వివరించారు. 

గీజర్‌తో జాగ్రత్త
ఇంట్లో గీజర్‌ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఆన్‌ చెయ్యకుండా.. కుటుంబ సభ్యులంతా ఒకరి తర్వాత మరొకరు స్నానాలు చేస్తే మంచిది. థెర్మోస్టాట్‌ 50–60 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉండేలా చూసుకోవాలి. రెండు స్నానాల గదులుంటే ఒకటే గీజర్‌ నీటిని వాడేలా పైపులు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే బిల్లులో నెలకు కనీసం రూ.400 వరకూ ఆదా చెయ్యొచ్చు.

ఏసీని అదుపు చెయ్యాల్సిందే
ఏసీ ఎలా వాడాలో చాలామందికి తెలియదు. ముందుగా గదిలో చల్లదనాన్ని గ్రహించే వస్తువులు లేకుండా చూసుకోవాలి. గాలి బయటకు వెళ్లే అవకాశం లేకుండా గది త్వరగా చల్లబడుతుంది. వెంటనే చల్లబడాలని 18 డిగ్రీలు పెట్టేస్తుంటారు. కానీ ఎప్పుడు ఆన్‌ చేసినా 24 నుంచి 26 మధ్య ఉంచితే రూ.300 వరకు బిల్లు తగ్గుతుంది.

పాత ఫ్రిజ్‌తో జేబుకు చిల్లు
ఫ్రిజ్‌ ఉంచే ప్రదేశానికి, గోడకు మధ్య వేడి తగ్గించేలా కొంత ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా మీరు వాడే ఫ్రిజ్‌ పాతదైతే నెలకు 160 యూనిట్లకు పైనే కరెంట్‌ కాలుతుంది. అదే స్మార్ట్‌ ఫ్రిజ్‌ అయితే అవసరమైనప్పుడే ఆన్‌ అవుతాయి. లేకుంటే ఆగిపోతాయి. వీటివల్ల మీ బిల్లు రూ.300 వరకు తగ్గే వీలుంది. 

తడవకో జత ఉతక్కూడదు
ఎప్పుడూ లోడ్‌కు తగ్గట్టుగా దుస్తులు వేయాలి. లోడ్‌కు మించి వేయకూడదు. అలాగని తడవకో జత దుస్తులను ఉతక కూడదు. ఏంచేసినా విద్యుత్‌ వినియోగం పెరుగుతుంది. అన్నింటికీ మించి మిషన్‌ పని విధానాన్ని కనీసం మూడు నెలలకోసారైనా మెకానిక్‌ చేత పరీక్షించాలి. మోటర్‌ స్లో అయితే విద్యుత్‌ వాడకం ఎక్కువవుతుంది. జాగ్రత్తలు పాటిస్తే రూ.60 ఆదా చెయ్యొచ్చు.

ఒవెన్‌ ఊరికే తెరిచి చూడొద్దు 
వంటకానికి వాడే పదార్థాన్ని బట్టి టైం సెట్‌ చేయాలి. ఒకసారి ఆన్‌ చేశాక తరచూ తెరిచి చూస్తే టెంపరేచర్‌ పడిపోతుంది. అది మళ్ళీ వేడెక్కాలంటే ఎక్కువ కరెంట్‌ తీసుకుంటుంది. చిన్నా చితక వంటలకు ఓవెన్‌ వాడకపోవడమే మంచిది. ఇలాచేస్తే రూ.150 వరకు బిల్లు ఆదా అవుతుంది.

మరిన్ని వార్తలు